శబరిమలలో సరైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాసి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు.
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేక ఇబ్బందులకు గురవుతున్న భక్తుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. గత కొద్ది రోజులుగా శబరిమల క్షేత్రంలో రద్దీని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంతో తొక్కిసలాట పరిస్థితులు తలెత్తుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతిఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాలు నుంచి వచ్చే భక్తుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంటుందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అయితే ఈసారి శబరిమలలో అయ్యప్పస్వామి సన్నిధానంలో ఏర్పాట్లు సరిగాలేని కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. భక్తుల ద్వారా, పత్రికలు, చానళ్లలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోందని తెలిపారు.
ఇటీవలే.. శబరిమల అయ్యప్ప సన్నిధానంలో దర్శనం సందర్భంగా కనీస ఏర్పాట్లులేక తొక్కిసలాటలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసి చాలా బాధకలిగిందని చెప్పారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతున్న సందర్భంలో.. ప్రభుత్వం తరపున తగిన సంఖ్యలో ఉద్యోగులను, ఇతర సిబ్బందిని శబరిమలలో మోహరించి.. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో.. పంబా నది పరిసరాలు, సన్నిధానం వరకు పాదయాత్ర, ట్రెక్కింగ్ జరిగే ప్రాంతాల్లో భక్తులకు సహాయం చేసే విషయంలో.. స్వచ్ఛంద సేవాసంస్థలను కూడా భాగస్వాములను చేసేదిశగా చొరవతీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.