రోజువారీ కరోనా కేసులు ముందు రోజుకన్నా స్వల్పంగా తగ్గినా పలువురు ప్రముఖులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్రం మంత్రులు రాజనాథ్ సింగ్, అజయ్ భట్, ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, బసవరాజ్ బొమ్మై, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, సిపిఎం అగ్రనేతలు ప్రకాష్ కారత్, బృందా కారత్ లతో పాటు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.
ప్రముఖ నటి, బిజెపి నేత కుష్భు సుందర్ కూడా కరోనాకు గురయ్యారు. వీరంతా హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. గడిచిన 24 గంటల్లో లక్షా 68 వేల 63 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో పోలిస్తే ఇవాళ 11,660 కేసులు తగ్గాయి. ముందు రోజుతో పోలిస్తే 6.5 శాతం తక్కువగా కేసులు వచ్చాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
అలాగే ఒక్క రోజులో 277 మంది మరణించినట్లు వెల్లడించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 33,470 కొత్త కేసులు నమోదయ్యాయి. వెస్ట్ బెంగాల్లో 19,286 మందికి కరోనా సోకగా, ఢిల్లీలో 19,166 మంది, తమిళనాడులో 13,990 మంది, కర్ణాటకలో 11,698 మంది కరోనా బారినపడ్డారు.
కాగా, దేశంలో ఇప్పటి వరకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,461కు పెరిగింది. మరోవైపు కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కేసులు పెరుగుతుండటంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
వారాంతరపు లాక్ డౌన్ తో పాటు.. కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. 50 శాతం కెపాసిటీతో జిమ్స్, కార్యాలయాలను రన్ చేస్తున్నారు. లక్షణాలు లేవని నిర్లక్ష్యం చేయొద్దని.. మస్ట్‌గా కరోనా రూల్స్ పాటిస్తూ.. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా టెస్టు చేయించుకోవాలంటున్నారు. ఇటు టీకా పంపిణీ కూడా దేశ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 151 కోట్ల డోసులను కేంద్ర వైద్యారోగ్యశాఖ పంపిణీ చేసింది. మరోవైపు టీనేజర్లకు వ్యాక్సిన్ వేస్తున్నారు అధికారులు. ఇటు బూస్టర్ డోసు కూడా దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లో మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అమెరికాలో నిన్న ఒక్కరోజే 11 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడ ఆస్పత్రుల్లోచేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం ఒమిక్రాన్ బాధితులే ఉన్నట్లు అక్కడి అధికారులు తెలుపుతున్నారు. ఆస్పత్రికి వచ్చేవారిలో పిల్లలే అధికంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. ఇక ఫ్రాన్స్, బ్రిటన్ లో మహమ్మారి పంజా విసురుతోంది.