తెలంగాణ ఎన్నికల అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాజకీయ పక్షాలు ఎన్నికల సన్నాహాలలో తలమునకలవుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండున్న గంటల పాటు ఆదివారం సాయంత్రం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
సుదీర్ఘంగా సాగిన కీలక భేటీలో పలు రాజకీయ అంశాలపై ఇరు పార్టీల అధినేతలు చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ‘‘ఇరు పార్టీల అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగిందని, అనేక అంశాలపై చర్చలు సుహృద్భావంగా జరిగాయని నాదెండ్ల చెప్పారు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో సమష్టిగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా, ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు.
భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించిన్టు నాదెండ్ల తెలిపారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇరు పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో చర్చించారని వైసీపీని ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా, వైసీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించేందుకు అవసరం అయిన అన్ని విషయాల పట్ల పూర్తిస్థాయి చర్చ జరిగిందని చెప్పారు.
కాగా, సీట్ల సర్దుబాటుపై వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. మరికొన్ని సమావేశాల తర్వాత సంక్రాంతి నాటికి ఇది కొలిక్కి రానున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి మ్యానిఫెస్టో పైనా ఇద్దరు నేతలూ చర్చించారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఎక్కడ నుంచి బరిలో దిగాలనే అంశంపై నేతలు చర్చించారు. ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఏయే అంశాలు పెట్టాలి? దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ నడిచింది.
ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి? ఎవరెవరు హాజరవ్వాలి? వాటిని ఎప్పట్నుంచి ప్రారంభించాలనే అంశాలపైనా ఇద్దరు నేతలూ చర్చించారు. అన్నీ కొలిక్కి వచ్చాక.. బహిరంగ వేదికపైకి వచ్చి కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఇదే వేదికపై నుంచి ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.