అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై దాడుల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని కరాచీలో ఉంటున్న దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరగడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో వెంటనే దావూద్‌ను తన అనుచరులు ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు వెలువడ్డాయి.
ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దావూద్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ అధికారులెవరూ ఇప్పటివరకు ధృవీకరించలేదు. అతని ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని తెలుస్తోంది.
ఇక దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు మాత్రమే స్థానిక మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. దావూద్‌పై విష ప్రయోగం జరిగిందనే వార్త ఏ రిపోర్టులోనూ ధృవీకరించలేదు.
మరోవైపు.. దావూద్ చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఆస్పత్రిలోని దావూద్ ఇబ్రహీం చికిత్స పొందుతున్న ఆ అంతస్తులో అతను ఒక్కడే రోగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆస్పత్రి ఉన్నత అధికారులు, దావూద్ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే ఆ అంతస్తులోకి ప్రవేశం కల్పించినట్లు తెలుస్తోంది.
కాగా, పాకిస్థాన్‌లో దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందన్న వార్తతో ఆ దేశంలో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ ఘటనతో పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ సర్వర్ డౌన్ అయ్యిందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో కూడా సర్వర్లు పనిచేయలేదని తెలుస్తోంది. ఇది కాకుండా ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కూడా పనిచేయలేదని సమాచారం. ఇక రాత్రి 8 గంటల తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ మొత్తం తగ్గిపోయిందని తెలుస్తోంది.