ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని సోమవారం ప్రారంభించారు. వారణాసిలో ‘స్వరవేద్ మహా మందిర్ ధామ్’ పేరిట ఈ ధ్యాన మందిరం నిర్మించారు. ఇక్కడ ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకోవచ్చు. వారణాసికి 12 కిలోమీటర్ల దూరంలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మహా మందిరాన్ని నిర్మించారు.
ఈ మహామందిరింలో 125 తామర పూవు రేకుల గోపురాలు ఉన్నాయి. ఈ మందిరంలో మొత్తం 20 వేల మంది కూర్చోవచ్చు. ఆ ఆలయవంలో వేసిన మకరానా పాలరాతిపై మొత్తం 3,137 స్వర్వ్ శ్లోకాలను చెక్కారు. ఈ మందిర ప్రాంగణంలో ఔషధ మూలికలతో కూడిన అద్భుతమైన తోట కూడా ఉంది.
ఈ మందిరంలో మొత్తం 101 ఫౌంటెన్లను ఏర్పాటు చేశారు. 2004లో ప్రారంభమైన ఈ మందిరం నిర్మాణంలో 15 మంది ఇంజనీర్లు, 600 మంది కార్మికులు పాల్గొన్నారు. “స్వర్వేద్ మహా మందిరం భారతదేశం సామాజిక, ఆధ్యాత్మిక బలానికి ఆధునిక చిహ్నం” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
ఈ ధ్యాన మందిరాన్ని ఏడు అంతస్తుల్లో నిర్మించారు. రామాయణ, మహాభారత కావ్యాలను ప్రతిబింబించే కళాకృతులు ఈ మహా మందిరంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. ఈ ధ్యాన మందిరం నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహరాజ్, విజ్ఞానంద్ దేవ్ మహరాజ్ దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని మోదీకి వివరించారు.
ధ్యాన మందిరం పైకప్పు కమలం ఆకృతిలో ఉండడం ప్రధాని మోడీని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రధాని ధ్యాన మందిరం మొత్తం కలియతిరిగారు.