ప్రజల భద్రతా ప్రయోజనాల కోసం, అత్యవసర పరిస్థితుల్లో ఏ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్నైనా కేంద్రం తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చు. ఈమేరకు కేంద్రం సోమవారం లోక్సభలో టెలికమ్యూనికేషన్ బిల్లు 2023 ముసాయిదాను ప్రవేశపెట్టింది. గతవారం పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల నిరసనల మధ్య కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లుని ప్రవేశపెట్టారు.
విపత్తు నిర్వహణతో పాటు ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు ప్రజల భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక అధికారి నోటిఫికేషన్ ద్వారా అధీకృత సంస్థ నుండి ఏదైనా టెలీకమ్యూనికేషన్ నెట్వర్క్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చని ముసాయిదా పేర్కొంటోంది.
ప్రజల భద్రత పేరుతో ఇంటర్నెట్ను నిలిపివేయవచ్చని తెలిపింది. చట్టవిరుద్ధంగా మెసేజ్లను అడ్డుకుంటే మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ. 2 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు లేదా ఏకకాలంలో రెండూ విధించే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే టెలికాం వివాదాల పరిష్కారం మరియు అప్పిలేట్ ట్రిబ్యునల్స్ రూపొందించేందుకు అవకాశం కల్పిస్తోంది.
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ 1933 మరియు టెలిగ్రాఫ్ వైర్స్ (చట్టవిరుద్ధమైన స్వాధీనం) స్థానంలో గత వారం ఈ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ చట్టాలలో కొన్ని 138 ఏళ్ల నాటివని, కమ్యూనికేషన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల నేపథ్యంలో కొత్త చట్టం అసవరమని ప్రభుత్వం వాదిస్తోంది.