హిందువులు హలాల్ మాంసం తినడం ఆపేయాలని, జట్కా మాంసం మాత్రమే తినాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ హితవు చెప్పారు. బీహార్ రాష్ట్రంలోని బెగూసరాయ్‌లో మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో జంతు బలి ఉన్నదని కేంద్రమంత్రి చెప్పారు.
ముస్లింలను తాను గౌరవిస్తానని, వాళ్లు వారి మత ఆచారం ప్రకారం హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారని చెప్పారు. హిందువులు వెంటనే హలాల్ మాంసాన్ని తినడం ఆపేయాలని, జట్కా మాంసాన్ని మాత్రమే తినాలని కోరారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన వెనుక ఉన్నదెవరో త్వరలో బయటపడుతుందని గిరిరాజ్ సింగ్ చెప్పారు.
పార్లమెంట్‌పై దాడి కూడా రైతుల ఉద్యమం లాంటిదేనని, ఇందులో కూడా టూల్‌కిట్ గ్యాంగ్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, కారకులెవరో త్వరలో తేలుతుందని స్పష్టం చేశారు. రైతుల ఉద్యమ సమయంలో టూల్‌కిట్ గ్యాంగ్ ఎలా బయటపడిందో అలాగే పార్లమెంట్ ఘటన వెనుక ఉన్నదెవరో కూడా తెలుస్తుందని ఆయన తేల్చి చెప్పారు.