మరోసారి కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఈ వారం రోజుల్లోనే అక్కడ కొవిడ్-19 కేసులు 277 శాతం పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కేరళలో గత వారం 111 యాక్టివ్ కేసులు ఉండగా, వాటి సంఖ్య ఒక్కసారిగా 1,634కు చేరింది. వీటిలో జేఎన్.1 అనే కొత్త వేరియంట్ బయటపడటం మరింత బెంబేలెత్తిస్తోంది.
దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. జేఎన్.1 వేరియంట్ తొలి కేసు అమెరికాలో వెలుగుచూసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది బయటపడింది.
ఒమిక్రాన్ రకంలోని పిరోలా వేరియంట్ (బీఏ.2.86) నుంచి ఇది రూపాంతరం చెందింది. బీఏ.2.86లోని స్పైక్ ప్రోటీన్‌తో పోలిస్తే ఈ వేరియంట్లో ఒక్క మ్యుటేషన్ అదనంగా కనిపించింది.. బీఏ.2.86 ప్రోటీన్‌లో 20 మ్యుటేషన్లు ఉండగా.. ఈ కొత్త వేరియంట్లో 21 మ్యుటేషన్లు ఉన్నాయి. అందువల్ల దీని లక్షణాలు కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి.
అయితే ఒక మ్యుటేషన్ అదనంగా ఉండటం వల్ల ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చాలా వేగంగా ఉందని అమెరికాలోని నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిష్రేషన్ అధికారులు హెచ్చరించారు. అమెరికాలో 15 నుంచి 29 శాతం వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
అమెరికాలో మొదలైన ఈ వేరియంట్ ఇప్పుడు 38 దేశాలకు వ్యాపించింది. చైనాలో డిసెంబర్ 15న 7 కేసులు గుర్తించారు. తాజాగా భారత్‌లోనూ ఈ కేసులు బయటపడ్డాయి. భారత్‌లో తొలి కేసు కేరళలో బయటపడింది. తిరువనంతపురం కారకుళంలోని 79 ఏండ్ల వృద్ధురాలికి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించినప్పుడు జేఎన్.1 వేరియంట్ ఆనవాళ్లు బయటపడ్డాయి.
ఇంతలోనే ఆ పేషెంట్ మరణించడంతో ఈ వేరియంట్‌పై రకరకాల ఆందోళనలు మొదలయ్యాయి. దీనిపై వైద్యులు వివరణ ఇచ్చారు. సదరు రోగికి జేఎన్.1 వేరియంట్ సోకింది.. కానీ ఆమె మరణానికి అదే కారణం కాదని వెల్లడించారు. అంతకుముందు నుంచి ఆమె కిడ్నీ, ఇతరత్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదని.. వాటి కారణంగానే ఆమె మరణించిందని ప్రకటించారు.