అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొలరాడో సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో రాష్ట్రం నుంచి పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ పై ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ఆయనపై నిషేధం విధించింది.
అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం దేశాధ్యక్ష పదవిని చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని కోర్టు ప్రకటించింది. ఇలాంటి తీర్పును ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. అయితే ఈ తీర్పుపై అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ట్రంప్ కు కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చింది.
కొలరాడో కోర్టు తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చ్ 5న జరగనున్న కొలరాడో రిపబ్లికన్స్ ప్రైమరీ బ్యాలట్ పై మాత్రమే కాకుండా… నవంబర్ 5న జరిగే ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండబోతోంది. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి.. డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడానికి ఎన్నికల కమిషన్ కారణమంటూ 2021 జనవరి 6వ తేదీన ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున వాషింగ్టన్లో నిరసన చేశారు.
ఆ ర్యాలీ సందర్భంగా మద్దతుదారులు యూఎస్ పార్లమెంట్ భవనంపై దాడికి పాల్పడ్డారు. దీంతో ట్రంప్ వల్లే ఇలాంటి హింసాత్మక ఘటన చోటు చేసుకుంది అందుకే అతడ్ని ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఏడు మంది న్యాయమూర్తుల ధర్మాసనం ప్రకటించింది.
ఈ తీర్పుపై ఏడుగురు సభ్యులతో కూడిన న్యాయమూర్తుల ధర్మాసనంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ముగ్గురు జడ్జీలు ఈ తీర్పును వ్యతిరేకించగా.. మిగతా నలుగురు ట్రంప్ నిషేధానికి ఒకే చెప్పారు. మెజారిటీ సభ్యులు ట్రంప్ అనర్హతకు అనుకూలంగా ఉండటంతో ఈ తీర్పును వెల్లడించింది.