తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుధవారం రాష్ట్ర శాసనసభలో శ్వేతపత్రంను ప్రవేశపెట్టారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క శ్వేతపత్రంను సభ ముందు ఉంచుతూ బడ్జెట్ కు, వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉందని తెలిపారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, 2023 నాటికి అప్పులలో కూరుకుపోయిందని విమర్శించారు.
2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ. 72,658 కోట్లు కాగా ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లకు చేరుకున్నాయి. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో అప్పు సగటున 24.5 శాతానికి పెరిగింది. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ. 3,89,673 కోట్లుగా ఉంది. 2015-16లో రుణ, జీఎస్డీపీ దేశంలోనే అత్యల్పంగా 15.7 శాతం ఉండగా, అది 2023-24 నాటికి 27.8 శాతానికి పెరిగింది.
బడ్జెటేతర రుణాలు పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణభారం పది రెట్లు పెరిగింది. రెవిన్యూ రాబడిలో రుణాల చెల్లింపు భారం 34 శాతానికి చేరుకుంది. మరో 35 శాతం ఉద్యోగుల జీతభత్యాలకు, పెన్షన్లకు వెళ్ళింది. ఈ పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదు.
2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది. ప్రస్తుతం పది రోజులకు తగ్గింది. రోజువారీ ఖర్చులకు కూడా రిజర్వు బ్యాంకుపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని విపక్ష నేత, మాజీ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆయన స్వల్పకాలిక చర్చలో మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. విపక్షాలపై రాజకీయ దాడి చేయడం ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోందని చెప్పారు.
శ్వేతపత్రంలో వాస్తవాల వక్రీకరణ జరిగిందనీ, ప్రభుత్వానికి అనుగుణంగా లెక్కలు తయారు చేశారని ఆయన విమర్శించారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సస్పెండయిన ఒక ఆంధ్ర అధికారి సహాయంతో శ్వేతపత్రాన్ని రూపొందించారని హరీశ్ ఆరోపించారు. తెలంగాణా అధికారులపై నమ్మకం లేకనే ప్రభుత్వం ఆంధ్ర అధికారులతో శ్వేతపత్రాన్ని రూపొందించిందని పేర్కొన్నారు. శ్వేతపత్ర రూపకల్పనలో ముఖ్యమంత్రి పాత గురువు, శిష్యుల పాత్ర ఉందని ఆరోపించారు.
హరీశ్ రావు వ్యాఖ్యలకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీరు వచ్చాక శివుడి తలపై ఉన్న గంగను భూమి మీదకు తెచ్చి భూమి మీద నుంచి గోదావరి తెచ్చి.. గోదావరి నుంచి కాళేశ్వరానికి పారించారా? అని అడిగారు రేవంత్ రెడ్డి. సభను హరీశ్ రావు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ కి ఎంత ఖర్చు చేశారు.. ఎన్ని రుణాలు తీసుకున్నారనే వివరాలను బయటకు తీస్తామని తెలిపారు. కార్పొరేషన్ల అప్పులకు సంతకాలు పెట్టింది ఎవరు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.