ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం- జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘యువగళం-నవశకం’ పేరుతో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వెల్లడించారు.
20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యత తీసుకుంటామని, అన్నదాత కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు ఆర్థిక సాయం చేస్తామని హామీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెబుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. నారా లోకేష్ చేసిన పాదయాత్రకు జగన్ సర్కారు అనేక అడ్డంకులు సృష్టించిందని చంద్రబాబు మండిపడ్డారు.
పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెట్టారని, యువగళం వాలంటీర్లను జైలుకు పంపారని పేర్కొంటూ తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. యువగళం.. ప్రజా గర్జనకు నాంది పలికిందని, ప్రజల్లో ఉండే బాధ, ఆక్రోశం, ఆగ్రహం యువగళంలో చూపించారని తెలిపారు.
అధికార వైసీపీ నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగిపోతోందని, మెడపై కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర పాలనలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదని చెప్పారు. ఒకప్పుడు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉండేదని.. ఇప్పుడు గంజాయి రాజదానిగా మారిందని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిందని పేర్కొన్నారు.
జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, విధ్వంస పాలనకు జగన్ నాంది పలికారని విమర్శించారు. వైసీపీ పాలనలో కంపెనీలన్నీ పారిపోయాయని ఎద్దేవా చేశారు చంద్రబాబు. రుషికొండను బోడి గుండు చేసి.. సీఎం నివాసం కోసం రూ. 500 కోట్లతో విల్లా కట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
టీడీపీ అధికారంలో ఉండివుంటే 2020 నాటికి పోలవరం పూర్తి చేసేవాళ్లమని చెబుతూ అబద్ధాల పునాదులపై నిర్మించిన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మారాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి.. టీడీపీ-జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు.
‘‘వైసీపీ అధినాయకత్వం వచ్చే ఎన్నికల్లో దాదాపు 80మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నట్టు తెలిసింది. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, సీఎం జగన్ను. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం’’ అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
జగన్ బలమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారని, అయితే పాలన ప్రారంభమైన మొదటిరోజు నుంచీ కూల్చివేతలు, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ప్రశ్నించే వారిపై, ప్రత్యర్థులపై కేసులు బనాయించే స్థితిలో సీఎం ఉండడం దురదృష్టకరమన్నారు.
తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినప్పుడు ప్రజలకు మేలు చేసేలా పాలన సాగించాలని కోరానని, దురదృష్టవశాత్తూ జగన్ దానికి విరుద్ధంగా కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ఇన్నేళ్ల రాష్ట్ర చరిత్రలో వైఎస్ సహా ఏ ఒక్క నాయకుడూ ఇంట్లో ఉన్న ఆడవాళ్ల గురించి మాట్లాడలేదని, కానీ, ఇంట్లోని మహిళలను నీచంగా విమర్శించే స్థితిని జగన్ తీసుకువచ్చారని మండిపడ్డారు. ఇంట్లో ఉన్న తల్లికి, చెల్లికి విలువ ఇవ్వనివాడు… ఇతరులకు ఏమి ఇస్తాడని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
