హమాస్ ను పూర్తిగా అంతం చేసే లక్ష్యంతో గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు అధికారికంగా 20 వేల మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉండడం మరో విషాదం. అక్టోబర్ 7వ తేదీన హహాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ లోకి చొరబడి నరమేథం సృష్టించడంతో ఈ దాడులు ప్రారంభమయ్యాయి.
ఇళ్లల్లోకి చొరబడి విచక్షణారహితంగా దాడులు చేస్తూ సుమారు 1200 మందిని చంపేశారు. 240 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. ఈ ఘటనతో ప్రపంచమంతా షాక్ కు గురైంది. ఈ దాడిని తీవ్రంగా తీసుకున్న ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. నాటి నుంచి నేటి వరకు హమాస్ లక్ష్యంగా వైమానిక దాడులు కొనసాగిస్తుంది.
గాజాలో చొరబడి గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. గాజాలో హమాస్ మిలటరీ స్థావరాల ధ్వంసం పేరుతో హాస్పిటల్స్ ను, ఇతర పౌర భవనాలను, నివాస ప్రాంతాలను ధ్వంసం చేస్తోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 20,057 మంది చనిపోయారని, 53,320 మంది గాయపడ్డారని అక్కడి వైద్యాధికారులు తెలిపారు.
వీరిలో 65 శాతంకు పైగా మహిళలు, చిన్నారులే ఉన్నారని వెల్లడించారు. 20 వేల మంది అంటే, గాజా జనాభాలో సుమారు 1 శాతం. ఇజ్రాయెల్ దళాలు హమాస్ మిలిటెంట్లు, సాధారణ ప్రజలు అన్న తేడా లేకుండా ప్రాణాలు తీస్తోంది.
అయితే, హమాస్ వ్యూహాత్మకంగా సాధారణ నివాస ప్రాంతాల్లోనే తమ మిలటరీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుందని, ఆ మిలటరీ కేంద్రాలను ధ్వంసం చేసే క్రమంలో సామాన్య పౌరుల ప్రాణాలు కూడా పోతున్నాయని ఇజ్రాయెల్ వాదిస్తోంది. గాజాలోని సుమారు 85 శాతం మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
మరోవైపు, ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో నిత్యావసరాలకు కొరత ఏర్పడింది. మానవతా సాయం అందించడానికి వివిధ దేశాలు ముందుకు వస్తున్నాయి. కానీ సరిహద్దుల వద్ద వాటిని ఇజ్రాయెల్ దళాలు అడ్డుకుంటున్నాయి. గాజాలో ప్రతీ నలుగురిలో ఇద్దరు ఆకలితో అలమటిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు 7 వేల మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చామని ఇజ్రాయెల్ ప్రకటించింది.