ఎంఎల్ఎల కొనుగోలుకు సంబంధించిన కేసులో విచారణ కొనసాగుతోందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. త్వరలోనే ఈ కేసుపై అన్ని వివరాలు అందిస్తామని తెలిపారు. సైబరాబాద్ వార్షిక నేర నివేదికను విడుదల చేస్తూ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈసారి సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని తెలిపారు. అలాగే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యా యత్నం కేసులో సైతం దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
సైబరాబాద్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు మరింత పకడ్బందీగా పని చేస్తామని వెల్లడించారు. ఆర్థిక, స్థిరాస్తి నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కమిషనరేట్ సిబ్బంది రెండు నెలలు సమర్థంగా పనిచేశారని ప్రశంసించారు.
’గతేడాది సైబర్ క్రైమ్ కేసులు 4,850 ఉంటే, ఈసారి 5,342 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది రూ.232 కోట్ల మోసం జరిగింది. 2023లో 277 డ్రగ్స్ కేసులు నమోదవ్వగా 567 మందిని అరెస్ట్ చేశాం. రూ.27.82 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశాం.’ అని వెల్లడించారు. 2023లో రెండు పిడి యాక్ట్ కేసులు నమోదు చేశామని తెలిపారు.
ఈ ఏడాది మహిళలపై నేరాలు తగ్గాయని చెబుతూ 2022లో 316 అత్యాచారం కేసులు నమోదైతే, ఈసారి 259 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతేడాది పోలిస్తే మోసాల కేసులు పెరిగాయని, 2022లో 6,276 కేసులు రాగా, ఈ ఏడాది 6,777 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
సైబరాబాద్ పరిధిలో హత్యలు, దోపిడి, చోరీ, రోడ్డు ప్రమాదాల కేసులు కూడా పెరిగాయని వివరించారు. 2022లో 93 హత్య కేసులు వస్తే ప్రస్తుతం 105 హత్య కేసులు నమోదైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది 52,124 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైతే, వాటిలో 1,271 మందికి శిక్షలు పడ్డాయని వెల్లడించారు.
ప్రతి అధికారిపై పర్యవేక్షణ ఉంటుందని, సిఫార్సు లేఖలపై పోస్టింగులు ఉండవని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి స్పష్టం చేశారు. అలాగే, నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే వారు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.