ఎన్నికల నిర్వహణలో తప్పులు లేని ఓటర్ల జాబితా అత్యంత కీలకమని, ఆ దిశలో కృషి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్రశర్మ, నితీష్‌కుమార్ వ్యాస్లు అధికారులకు సూచించారు. మరో మూడు నెలల్లో జరగాల్సిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సన్నాహాలపై శుక్ర, శనివారాలలో ఏపీలో అధికారులతో వరుసగా సమీక్షలు జరిపారు.
తొలి రోజున విజయవాడలోని ఒక హోటల్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎటువంటి ఉద్రిక్తతలు లేకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలంటే ఓటర్ల జాబితాపై పూర్తిస్థాయి దృష్టి సారించాల్సి ఉంటుందని చెప్పారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా, ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించేలా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
ఎన్నికల సన్నద్ధత, నిర్వహణలో ప్రతి దశలోనూ అప్రమత్తత అవసరమని పేర్కొంటూ ఎన్నికల యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో ఎక్కడా మరణించిన వారి పేర్లు, ఒక వ్యక్తికి రెండుచోట్ల ఓట్లు నమోదు లేకుండా చూడాలని చెప్పారు. ఎన్నికల అధికారులు, ప్రజలకు, అభ్యర్ధులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానంపై కూడా పూర్తిస్థాయి పట్టుకలిగి ఉండాలని సూచించారు.
రాజకీయపార్టీల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని, పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములయ్యే సిబ్బందికి సమర్థవంతమైన మాస్టర్ ట్రైనర్లతో రాష్ట్ర, జిల్లా నియోజకవర్గాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లు కీలకంగా నిలుస్తాయని, ఈ దిశలో దృష్టి సారించాలని పేర్కొన్నారు.
శుక్రవారం నంద్యాల, అనంతపురం, సత్యసాయి, ఎన్టిఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలు నివేదికలు సమర్పించారు. మిగిలిన జిల్లాల అధికారులతో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశాలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, డిజిపి రాజేంద్రనాధ్‌రెడ్డి, కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు పాల్గొన్నారు.