మరో మూడు నెలల్లో రానున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ఎట్లాగైనా గెలుపొందాలని పావులు కదుపుతున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే జనసేన అధినేతతో మంతనాలు సాగిస్తూ, ఉమ్మడి వ్యూహాలు రూపొందిస్తున్నారు. మరోవంక ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో అయన శనివారం ఉండవల్లిలో తన నివాసంలో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది.
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గెలుపు కోసం ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐపాక్ పని చేసింది. ఆ తర్వాత జగన్, కిశోర్ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఏపీ వ్యవహారాలపై పీకే దృష్టి సారించలేదు. మరో వైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ వాతావరణం వేడెక్కింది.
దానితో ప్రశాంత్ కిశోర్‌పై అధికార వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందరు పీకేలు వచ్చిన చేసేది ఏం లేదంటూ మండిపడుతున్నారు. హైదరాబాద్ నుంచి నారా లోకేష్‌తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రశాంత్ కిషోర్.. లోకేష్ కారులోనే చంద్రబాబు నివాసానికి వెళ్లారు.
చంద్రబాబు, లోకేష్, పీకే మధ్య దాదాపు 3 గంటల పాటు జరిగిన సుదీర్ఘ మంతనాల్లో కీలక విషయాలు చర్చించినట్లు సమాచారం. ఏపీలో తాను నిర్వహించిన సర్వే నివేదికలను చంద్రబాబు ముందు ప్రశాంత్ కిషోర్ ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్, లోకేష్‌తో పాటు.. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కోసం కలిసి పనిచేస్తున్న టీమ్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
దీంతో 2024 లో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ పని చేస్తారేమో అనే భావన వ్యక్తమైంది. అయితే తాజా ట్వీట్‌తో ఐప్యాక్ అందుకు అవకాశంలేదని స్పష్టతనిచ్చింది. మరి అలాంటప్పుడు ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతను కలవడం, ఈ భేటీలో టీడీపీ కోసం పని చేస్తున్న వ్యూహకర్త, ఒకనాటి పీకే సహచరుడు రాబిన్ శర్మ కూడా పాల్గొన్నాడని ప్రచారం జరుగుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
అయితే చంద్రబాబు సీనియర్ రాజకీయనేత కావడంతోనే ఆయన్ను కలిశానని, ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యం లేదని విమానాశ్రయం వద్ద ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అనంతరం ఐప్యాక్ టీమ్ సైతం ఇదే తరహాలో ట్వీట్ చేసింది. జగన్ మరోసారి అధికారంలోకి రావడం కోసం తాము ఏడాది కాలంగా వైఎస్సార్సీపీ తరఫున పని చేస్తున్నట్లు ఐప్యాక్ వెల్లడించింది.
ఈ క్రమంలో ఐపాక్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ గెలుపుకోసం పని చేస్తామని ట్విట్టర్ (ఎక్స్) పోస్ట్ పెట్టింది. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం జగన్‌కు తమ వంతు తోడ్పాటు అందిస్తామని పేర్కొంది. ఏపీలో వైఎస్సార్సీపీతో కలిసి పని చేస్తున్నామని, 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గెలుపుకోసమే తాము పని చేస్తాం అని స్పష్టం చేసింది.