రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది. నేటి ఉదయం నుంచి విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి.
భారీ పొగమంచుతో జగ్గయ్యపేట వద్ద వాహనాలు నిలిచిపోయాయి. చెన్నై-కలకత్తా హైవేపై కూడా పలు చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం అవుతున్నా పలు ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తుంది.
ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. శనివారం సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 7.4 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అసిఫాబాద్‌లో 8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 8.5, బేలలో 9.1, బజార్హత్నూర్లో 9.3, బోథ్, నిర్మల్‌లో 9.5, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఏపీలో కూడా చలి గాలుల తీవ్రత పెరిగింది. మన్యంలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. లంబసింగి, పాడేరు, చింతపల్లిలో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా వహించాలని అధికారులు సూచిస్తున్నారు.
గత రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో ఉష్ణో్గ్రతలు కనిష్టానికి పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో హైదరాబాద్ కు రావాల్సిన విమానాలను ఇతర ఎయిర్ పోర్టులకు దారి మళ్లిస్తున్నారు.
మూడు విమానాలు గన్నవరం ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. ఛత్తీస్గడ్, తిరువనంతపురం, గోవా నుంచి హైదరాబాద్ కు రావాల్సిన విమానాలను పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత వారిని తిరిగి గమ్యస్థానాలకు తరలించనున్నారు.
సోమవారం ఉదయం గం.07:35 లకు మస్కట్ నుంచి శంషాబాద్ రావాల్సిన ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టుకు దారి మళ్లించారు. రియాద్ నుంచి హైదరాబాద్ కు రావాల్సిన విమానం, జెడ్డా నుంచి రావాల్సిన విమానాలను పొగమంచు కారణంగా బెంగళూరుకు దారి మళ్లించారు. పలు విమానాలను బెంగళూరు, నాగపూర్, గన్నవరం విమానాశ్రయానికి దారి మళ్లించినట్లు శంషాబాద్ అధికారులు తెలిపారు.
మరోవంక,దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజధాని సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోకి పడిపోయింది. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం, అమృత్సర్, ఆగ్రా, గ్వాలియర్, ప్రయాగ్‌రాజ్, జైసల్మేర్ విమానాశ్రయాల్లో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ సఫ్దార్‌గంజ్‌లో 200 మీటర్లు, షిల్లాంగ్ విమానాశ్రయంలో 300 మీటర్లకు విజిబిలిటీ పడిపోయింది.
ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర ప్రభావం పడింది. దట్టమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.