త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న 2 వేల కొత్త బస్సుల్లో పురుషులకు ప్రత్యేకంగా సీట్లను రిజర్వ్ చేయించడంతో పాటు మహిళలకు మరిన్ని బస్సులను ఏర్పాటు చేయాలని టిఎస్ ఆర్టీసి భావిస్తున్నట్టుగా తెలిసింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఇటీవల మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే.
దీంతో బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ కారణంగా పురుషులకు సీట్లు దొరక్కపోవడంతో నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. కనీసం నిలబడే జాగా ఉండడం లేదని పురుషులు ఆర్టీసి అధికారులకు, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఆర్టీసిపై ఒత్తిడి పెరిగింది.
ఒకప్పుడు మహిళలకు ఆర్టీసి బస్సుల్లో రిజర్వ్ చేసిన సీట్లు ఇప్పుడు పురుషులకు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంనే ఆర్టీసి బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యాజమాన్యం భావిస్తున్నట్టుగా సమాచారం.
మహిళా ప్రయాణికులతో పాటు పురుషులు సైతం ముఖ్యమని, పురుషులు డబ్బులిచ్చి టికెట్ కొనడం వారికే సీట్లు దొరక్కపోతే రానున్న రోజుల్లో పురుష ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆధారపడే అవకాశం ఉండడం, దీనివల్ల ఆర్టీసికి నష్టం వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పురుష ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆర్టీసిని ఆదేశించినట్టుగా తెలిసింది.
దీంతో ఆర్టీసి సైతం ప్రత్యామ్నాయ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా పురుష ప్రయాణికులకు సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుంద? మహిళల కోసం మరిన్ని బస్సులను ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? తదితర అంశాలపై ప్రయాణికులతో పాటు సిబ్బంది నుంచి ఆర్టీసి వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలిసింది.
ఇందుకోసం బస్సుల్లో ఉండే 55 సీట్లలో 25 సీట్లను పురుషుల కోసం రిజర్వ్ చేసే విషయమై అధికారులు పరిశీలన చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే అన్ని డిపోల నుంచి మేనేజర్ల అభిప్రాయాలను ఉన్నతాధికారులు సేకరించినట్టుగా సమాచారం. అయితే పురుషులకు సీట్లు కేటాయిస్తే వ్యతిరేకత వస్తుందా? అనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తుండడం విశేషం.