తాలిబన్ల పాలన ప్రారంభమైన తర్వాత ఆఫ్ఘానిస్తాన్ జర్నలిస్టులకు నరకప్రాయంగా మారింది. స్వతంత్రంగా వార్తలు వ్రాసే స్వేచ్ఛ లేదు. మహిళలు వృత్తిని చేపట్టేందుకు వీలు లేదు. ఇటువంటి పలు వత్తిడుల కారణంగా, హింసాయుత దాడుల పర్యవసానంగా గత నాలుగు నెలల కాలంలో 80 శాతం మంది తమ వృత్తిని వదిలివేశారు.
జర్నలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అంచనా ప్రకారం తాలిబన్ల పాలనలో జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడంతో సుమారు 79 శాతం మంది జర్నలిజాన్ని వదులుకున్నారని, తమ జీవనోపాధి కోసం ఇతర వృత్తుల్లోకి మళ్లారని స్థానిక పత్రిక ఖామా ఒక నివేదికలో పేర్కొంది. దేశంలో 75 శాతం మీడియా సంస్థలు ఆర్థిక ఇబ్బందులతో మూసివేతకు గురయిన్నట్లు తెలిపింది.
ప్రభుత్వం కూలిపోయినప్పటి నుండి తూర్పు ప్రావిన్స్‌లైన నంగర్హర్, లఫ్మాన్, నూరిస్తాన్లలోని ఆరు రేడియో స్టేషన్లు మూతపడ్డాయని తెలిపింది. వాటిలో ఐదు ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా మూతపడగా, మరో స్టేషన్ ఉద్యోగులు లేకపోవడం వల్ల మూతపడిందని తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని ఆఫ్ఘన్ జర్నలిస్ట్స్ సేఫ్టీ కమిటీ అధ్యక్షుడు యూసఫ్ జరీఫ్ టోలో న్యూస్‌కి తెలిపారు.
ఆఘ్ఘన్లో తాలిబన్లు మహిళలపై పలు ఆంక్షలు విధించడంతో,. తమ స్టేషన్‌కి చెందిన మహిళా ఉద్యోగులు భయంతో జర్నలిజాన్ని వదులుకున్నారని ఆయన చెప్పారు. జర్నలిస్ట్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం 91 శాతం మంది జర్నలిస్టులు ఈ వృత్తిని ఎంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేయగా, కేవలం ఎనిమిది శాతం మంది మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న 462 మంది జర్నలిస్టులపై ఈ సర్వే చేపట్టింది. వీరిలో 390 మంది పురుషులు కాగా, 72 మంది మహిళలు ఉన్నారు. మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేయడంతో తాము ఉద్యోగాలను కోల్పోయామని పలువురు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారిందని తెలిపారు.
దీంతో జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితిని పరిష్కరించేందుకు ఫౌండేషన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పిలుపునిచ్చిందని ఆ నివేదికలో పేర్కొంది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్), ఆఫ్ఘన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఎఐజెఎ) నిర్వహించిన సర్వే ప్రకారం ఆగస్ట్ నుండి దేశంలో 40 శాతం మీడియా సంబంధిత సంస్థలు పనిచేయడం మానేశాయి. మరో 80 శాతం మహిళా జర్నలిస్టులు, మీడియా ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు.