ప్రతీ ఏటా క్రిస్మస్ రోజున యావత్తు ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చే పోప్ ఫ్రాన్సిన్ ఈసారి యుద్ధాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చారు. గాజాపై ఇజ్రాయిల్ పాల్పడుతున్న కనికరం లేని దాడులను ‘పవిత్రభూమిలో పనికిమాలిన యుద్ధంగా’ విమర్శించారు. యుద్ధాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. వలస వచ్చిన ప్రజల హక్కులను సమర్థించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్, సిరియా, యెమెన్, లెబనాన్, ఆర్మేనియా, అజర్బైజాన్ వంటి ప్రాంతాల్లో సాగుతున్న రాజకీయ, సామాజిక, సైనిక వివాదాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. గాజాతో సహా వివిధ యుద్ధాల్లో చనిపోతున్న చిన్నారులను ‘నేటి బాల యేసులు’గా పోప్ అభివర్ణించారు.
క్రిస్మస్ రోజున వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా సెంట్రల్ బాల్కనీ నుంచి అక్కడ కింద వున్న స్క్వేర్‌లో గుమిగూడి ఉన్న వేలాది మంది ప్రజలను ఉద్దేశించి పోప్ ‘ఉర్బి ఎట్ ఓర్బి’ (నగరం, ప్రపంచానికి సందేశం) ప్రసంగం చేయడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.
సోమవారం ప్రసంగంలో ఆయుధ పరిశ్రమలపై కూడా విమర్శలు చేశారు. యుద్ధాలను ఆయుధ పరిశ్రమ నియంత్రిస్తుందని పేర్కొన్నారు. ‘ఆయుధాల ఉత్పత్తి, అమ్మకాలు, వాణిజ్యం వేగంగా పెరుగుతున్నప్పుడు మనం శాంతి గురించి ఎలా మాట్లాడగలం’ అని ప్రశ్నించారు.
ఆయుధాల వ్యాపారంపై మరింత విచారణ జరగాలని విజ్ఞప్తి చేశారు. ‘నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల్లో అనేక మంది అమాయకులు బలవుతున్నారు. మరణించిన చిన్నారులంతా బాలయేసులు’ అని పోప్ పేర్కొన్నారు. ‘పాలస్తీనాలో దాడులతో ఆ ప్రజల జీవితాలు నాశమవుతున్నాయి. అక్కడ శాంతి రావాలి’ అని తెలిపారు. మా హృదయాలు బెత్లహోంతోనే ఉన్నాయని చెప్పారు. ఇజ్రాయిల్‌పై హమాస్ దాడులను కూడా పోప్ ప్రస్తావించారు.