గత రెండు వారాలుగా క్రమంగా మరోసారి కరోనా కేసులు దేశంలో పెరుగుతూ ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. ఇతర అనారోగ్య సమస్యలతో ఇటీవల అతడు ఆసుపత్రిలో చేరగా.. డాక్టర్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో అతడికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.
అప్పటి నుంచి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తుండగా.. తాజాగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తెలంగాణలో ఈ ఏడాదిలోనే తొలి కరోనా మరణం నమోదైంది. అదే ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన మరో వ్యక్తికి కూడా కరోనా సోకిన్నట్లు వైద్య పరీక్షలు వెల్లడించాయి.
అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ఏడాదిలో తొలి కరోనా మరణం మంగళవారం నమోదయ్యింది. కరోనాతో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. కొద్ది రోజుల కిందట అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు.
మృతురాలు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వైద్యలు తెలిపారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అప్పటి నుంచి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కానీ, పరిస్థితి విషమించి ఆమె డిసెంబరు 24న చనిపోయినట్టు పేర్కొన్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జేఎన్.1 వేరియంట్‌తో కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 4,170 కేసులు నమోదు కాగా.. ఒక్క కేరళలోనే 3 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా కొత్తరకం వేరియంట్ జేఎన్.1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ వేరియంట్ కేసులు 63కి చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, ఏపీలోకి ఈ వేరియంట్ ప్రవేశించినట్టు అనుమానిస్తున్నారు.
ఇక తెలంగాణలో గత వారం రోజులుగా రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. భూపలపల్లి జిల్లాలో ఒకే ఉంట్లో ఐదుగురికి కరోనా పాటిజివ్ నిర్ధరణ అయింది. గడచిన 24గంటల్లో 989 మందికి కరోనా టెస్టులు చేయగా.. వారిలో 10 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55కు పెరిగింది.
ఇక ఏపీలోలో ప్రస్తుతం 29 మంది యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో విశాఖ నుంచే 20 మందికి పాజిటివ్ రావటం ఆందోళన కలిగిస్తోంది. కొత్త సంవత్సరం వేడుకలు, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని అంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. లేదంటే వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా చిన్న పిల్లలు, 60 ఏళ్లు పైబడినవారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చలి కాలంలో శ్వాసకోస ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని.. కరోనా వ్యాప్తికి ఇది దోహదపడుతుందని చెబుతున్నారు. ఆరోగ్యపరంగా ఏవైనా అనుమానాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.