భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం రేటుతో వృద్ధి చెందే అవకాశం ఉందని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ విర్మానీ చెప్పారు. ప్రభుత్వ వ్యయం, ఎగుమతులు పెరిగినట్లు తెలిపారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రైవేటు వినియోగ రంగం ఇంకా కోలుకోలేదని తెలిపారు.
భారత దేశ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు ప్రస్తుతం సానుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఉద్యోగాల వృద్ధి రేటు వెనుకంజలో ఉందని చెప్పారు. సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ)లు సమ్మిళిత వృద్ధికి చాలా ముఖ్యమని చెప్పారు.
ఆధునిక ఎంఎస్ఎంఈలు కార్పొరేట్ రంగంతో పోటీ పడటానికి సంపూర్ణ అవకాశాలు ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అధికంగా ఉంటుందని, సుమారు 9.5 శాతం వరకు ఉండవచ్చునని చెప్పారు.
ఈ దశాబ్దం (1921-1930) సగటు వృద్ధి సుమారు 7.5 శాతం (+/- 0.5 శాతం) ఉండవచ్చునని అంచనా వేశారు. కరోనా మహమ్మారి ప్రభావం ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై పడిందని పేర్కొన్నారు. పన్నుల సంస్కరణలు రావాలని తెలిపారు. ఇదిలావుండగా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 9.2 శాతం ఉండవచ్చునని అంచనా. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.3 శాతం అనే విషయం తెలిసిందే.
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును 9.5 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) 2021లో భారత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 9.5 శాతం అని తెలిపింది. అదేవిధంగా వచ్చే ఏడాది ఈ వృద్ధి రేటు 8.5 శాతం అని అంచనా వేసింది.
యువతలో పెరుగుతున్న నిస్పృహ
మరోవంక, యువతలో నిస్పృహలు విపరీతంగా పెరిగిపోవడం, డిజిటల్ అసమానతలు, రాష్ట్రాల మధ్య గొడవలు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ముప్పులుగా పరిణమించాయని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన సర్వే వెల్లడించింది. వచ్చేవారం ఆన్లైన్లో దావోస్ అజెండా సమావేశం జరగనున్న నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్ ‘ది గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2022’ను విడుదల చేసింది.
దీర్ఘకాలంలో ప్రభావం చూపే రిస్కుల్లో వాతావరణానికి సంబంధించినవే ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయంగా టాప్ 10 ముప్పుల్లో వాతావరణం లేదా పర్యావరణానికి సంబంధించినవే ఐదు ఉన్నాయని పేర్కొంది. వాతావరణ సంక్షోభం, సామాజిక విభేదాలు పెరిగిపోవడం, సైబర్ ముప్పుల తీవ్రత, కరోనా మహమ్మారి నుంచి కోలుకొనే క్రమంలో అంతర్జాతీయ అసమానతలను ప్రధాన ముప్పులుగా సర్వే గుర్తించింది.
ఇదిలా ఉండగా గడిచిన రెండేళ్లుగా డిజిటల్ విధానంపై ఎక్కువగా ఆధారపడడంతో సైబర్ భద్రతకు పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపింది. భారత్ విషయానికి వస్తే రాష్ట్రాల మధ్య సంబంధాలు క్షీణించడం, రుణ సంక్షోభాలు, యువతలో పెరిగిపోతున్న నిస్పృహ, డిజిటల్ అసమానతలు, టెక్నాలజీ ఆధారిత పాలనలో వైఫల్యం.. ఈ అంశాలే దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించాయని వెల్లడించింది.
రాబోయే మూడేళ్లలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు కోలుకొనే తీరులో తీవ్ర అసమానతలు ఉంటాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారని ప్రపంచ ఆర్ధిక వేదిక సర్వే స్పష్టం చేసింది.