రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు నిత్యావసరాల ధరలు ఎగబాకుతుండటంతో ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. కిలో రూ. 25కే డిస్కౌంట్ ధరతో భారత్ రైస్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గోధుమ పిండి, పప్పుధాన్యాలను భారత్ ఆటా, భారత్ దాల్ పేరిట డిస్కౌంట్ ధరలకు ప్రజలకు కేంద్రం ఇప్పటికే అందిస్తోంది.
ఈ క్రమంలో భారత్ రైస్‌ను కూడా డిస్కౌంట్ ధరకు నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రయ భండార్ అవుట్‌లెట్స్, మొబైల్ వ్యాన్స్ వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. బియ్యం ధరలు సగటున కిలోకు రూ. 44కు చేరడంతో ద్రవ్యోల్బణం కట్టడి దిశగా కేంద్రం భారత్ రైస్ పంపిణీకి చర్యలు చేపడుతోంది.
ఇక ఇప్పటికే ప్రభుత్వం భారత్ ఆటా పేరిట కిలో రూ. 27.50కి, శనగ పప్పును రూ. 60కి అందిస్తోంది. ఈ ఉత్పత్తులను ఏకంగా 2000కుపైగా రిటైల్ పాయింట్స్‌లో విక్రయిస్తున్నారు. భారత్ రైస్‌ను కూడా ఇదే తరహాలో ప్రజలకు చేరవేస్తూ ధరల స్ధిరీకరణ చేపట్టాలని కేంద్రం భావిస్తోంది.
మరోవైపు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) సైతం దేశీయ మార్కెట్లో బియ్యం లభ్యతను మెరుగుపరిచేందుకు ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్) కింద రైస్‌ను ఆఫర్ చేస్తోంది.