సింగరేణిలో ఎర్ర జెండా రెపరెపలాడింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి కార్మికులు పట్టం కట్టారు. ఏఐటీయూసీ అనుబంధ ‘సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్’ను కార్మికులు తమ గుర్తింపు సంఘంగా ఎన్నుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీపై వామపక్ష అనుబంధ ఏఐటీయూసీ కార్మిక సంఘం దాదాపు 3 వేల ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.
సింగరేణిలో మొత్తం 11 ఏరియాలలో 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం-3లో ఐఎన్టీయూసీ విజయం సాధించింది.
కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్టీయూసీ గెలుపొందాయి. ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు, గుర్తింపు సంఘం ఎన్నికకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. సింగరేణి కార్మికుల్లో మొత్తం 39,773 ఓట్లు ఉంటే వాటిలో 37,468 ఓట్లు పోలయ్యాయి.
గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 94.20 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఇల్లెందు ఏరియాలో 98.37 శాతం, అతి తక్కువగా శ్రీరాంపూర్, రామగుండం-3 ఏరియాల్లో 93 శాతం ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగానే బ్యాలెట్ పెట్టెలను లెక్కింపు కేంద్రాలకు తరలించారు.
రాత్రి 7 గంటల నుంచి డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. సింగరేణి ఎన్నికల ప్రధానాధికారి శ్రీనివాసులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికల్లో చివరి వరకు ఏఐటీయూసీకి కాంగ్రెస్ అనుబంధ కార్మికసంఘం ఐఎన్టీయూసీ గట్టి పోటీ ఇచ్చింది. కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, రామగుండం-3, భూపాలపల్లి డివిజన్లలో ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీయూసీ విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలోని నాలుగు డివిజన్లలో కాంగ్రెస్ అనుబంధ సంఘం విజయం సాధించింది.