దేశంలో త్వరలోనే పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది ఎప్రిల్, లేదా మే నెలలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో కేంద్రం వినియోగారుల ప్రసన్న మంత్రానికి దిగనుంది. ఇంధన ధరలు ఓ మోస్తరు నుంచి భారీ స్థాయిలోనే తగ్గుతాయని భావిస్తున్నారు.
పెట్రో ధరల తగ్గింపు విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వ్యయ గణాంకాల విశ్లేషణలో పడింది. కేంద్ర కేబినెట్ నుంచి ఆమోదందక్కితే ధరల తగ్గుదలకు మార్గం సుగమం అవుతుంది. జనవరి మధ్యలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుని ప్రకటనను భారీ ప్రచార ఆర్బాటంతో వెలువరించేందుకు వీలుంది.
ఇటీవల వెలువడ్డ కేంద్ర ప్రభుత్వ కీలక అంతర్గత నివేదిక మేరకు ఇంధన ధరలకు కళ్లెం వేస్తారని వెల్లడైంది. అయితే దీని విషయంలో ఇప్పటికైతే అధికారికంగా ప్రభుత్వ వర్గాల నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. రష్యా ఉక్రెయిన్ యద్ధం తరువాత ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణల తీవ్రత దశలో దేశంలో పెట్రో ధరలు విపరీతంగా పెరిగాయి.
ఇప్పుడు క్రమేపీ అంతర్జాతీయ విఫణిలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనిని పరిగణనలోకి తీసుకుని పెట్రో ధరలను తగ్గించే విషయంలో కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని స్పష్టం అయింది. ధరల తగ్గింపు ఏ మేరకు ఉంటుందనేది తెలియలేదు.
పెట్రోలు డీజిల్‌పై లీటరుకు రూ 10 మేర తగ్గింపు ఉంటుందని భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం కేంద్రం పెట్రో ఉత్పత్తులపై లీటరుకు రూ 8 మేర తగ్గించారు. కేంద్ర ఎక్సైజ్ పాలసీ మేరకు ఈ పన్ను తగ్గింపు జరిగింది. దీనితో ధరలు తగ్గాయి. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలోనే ఇంధన ధరలు తగ్గించేందుకు రంగం సిద్ధం అవుతోంది.
దేశంలో ఇప్పుడు పెట్రోలు ధర లీటరుకు దాదాపు వంద రూపాయలు పల్కుతోంది. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ 96.71 పైసలు ఉంది. డీజిల్ ధర రూ 89.62 పైసలుగా నిలిచింది. ముంబై ఇతర నగరాలలో రూ వంద దాటాయి. స్థానిక పన్నులు అదనం కావడం మరింత భారం అయింది.
ఇప్పుడు ధరలు తగ్గితే రూ వందలోపు చేరితే వినియోగదారుడికి కొంతలో కొంత ఉపశమనానికి దారితీస్తుందని ఆశిస్తున్నారు. పలు మెట్రో నగరాలలో ఇప్పుడు పెట్రోలు ధర లీటరుకు రూ 110 అయింది. క్రూడాయిల్ ధరల ప్రభావం ఇక్కడి మార్కెట్‌పై పడింది.
అయితే అంతర్జాతీయ మార్కెట్ ధరల సమస్య ఏ విధంగా ఉన్నా వినియోగదారుడిపై భారం కొంతలో కొంతైనా తగ్గిస్తే , సార్వత్రిక ఎన్నికలలో ఓట్ల లాభం చేకూరుతుందని కేంద్రం ఆలోచిస్తోంది. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో అయినా తమ నేత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఇంధన ధరలకు కళ్లెం వేస్తూ వచ్చారని తరచూ కేంద్ర పెట్రోలు సహజవాయువుల మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెపుతున్నారు.
ఉత్తర అమెరికా దేశాలు , ఇతర ప్రాంతాలలో ఇంధనధరలు అంతర్జాతీయ పరిణామాల దశలో ఏకంగా దాదాపు 80 శాతం మేర పెరిగాయని, అయితే ఇండియాలో పెరిగింది కేవలం 5 శాతమే అని సెలవిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు ముడిచమురు ధరలు బారెల్‌కు 70 నుంచి 80 డాలర్ల మేర ఉంది.
దీనిని పరిశీలించి దేశంలో ఇంధన ధరల తగ్గింపునకు దిగేందుకు ఎటువంటి ఇబ్బంది లేదని నిపుణుల నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా ప్రధానికి కీలక సందేశం అందిందని వెల్లడైంది. క్రూడాయిల్ ధరల తగ్గింపుతో దేశంలోని ప్రధాన ప్రభుత్వ రంగ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియంలు భారీ లాభాలు గడించాయని వెల్లడైంది.
కాగా పలు ఒత్తిళ్లు వెలువడ్డా భారదేశం రష్యాకు ఉక్రెయిన్ విషయంలో పరోక్ష మద్దతుతో ఉండటం వల్ల రష్యా నుంచి భారీ స్థాయిలో ముడిచమురు అందుతోంది. దీనిని మరింతగా వాడుకుని మార్కెట్లోకి పంపించడం, ధరలను తగ్గించడం వచ్చే ఏడాది ఎన్నికలకు మంచి వాతావరణానికి దారితీస్తుందని మోడీ ఆశిస్తున్నారని వెల్లడైంది.