వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్కు వెళ్లేది నిజమైతే తానూ ఆమె వెంటే నడుస్తానని ఇటీవల ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి తాను ఎంతో సేవ చేసానని, తాను సర్వస్వం పోగొట్టుకున్నానని చెప్పారు.
తాను వైఎస్ షర్మిల వెంట నడుస్తానని పేర్కొంటూ తాను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తినని స్పష్టం చేశారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెబుతూ రూ.1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి రూ.120 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని విచారం వ్యక్తం చేశారు. అయినా, 50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించానని తెలిపారు.
మంగళగిరి అభివృద్ధికి కొన్ని పనులు జరిగినా నిధులు విడుదల కాలేదని, కాంట్రాక్టర్లు తనపై ఒత్తిడి తేవడంతో తాను సీఎంవోకు పదే పదే వెళ్లి అడిగానని, స్వయంగా తానే 8కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానని తెలిపారు. తన సొంత డబ్బుతో ఎంటీఎంసీ, దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు.
లోకేష్ ను ఓడించిన తనకు సహకారం అందించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. తాను ఎవరిని నిందించడం లేదని చెబుతూ ఎన్నికలు దగ్గరకు వచ్చినా.. ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారని ప్రశ్నించినా సమాధానం లేకపోవడంతో రాజీనామా చేశానని తెలిపారు. తన రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ళ ఇష్టమని, తాను మాత్రం స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చానని తేల్చి చెప్పారు.
మంగళగిరి ప్రజలకు తాను దూరంగా ఉండనని, అయితే ఎవరు గెలవాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని కూడారు. చాలామంది తనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారని, అయితే తాను మాత్రం వైఎస్ కుటుంబంతో ఉన్నానని.. ఉంటానని స్పష్టం చేశారు.
చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా కేసును వెనక్కి తీసుకోనని చెప్పారు. రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నా.. షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినా తన పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. సీఎం అయితే రేవంత్ రెడ్డి ఏమైనా గొప్పా? అని ప్రశ్నించారు.
తప్పు ఎవ్వరూ చేసినా తప్పేనని అంటూ వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కూడా కేసులు వేసేందుకు వెనకాడనని స్పష్టం చేశారు. తప్పులు ఎవరు చేశారు అనేది న్యాయ స్థానాలు తేలుస్తాయని చెప్పారు.తాను లేకపోయినా మంగళగిరి అభివృద్ధి ఆగదని పేర్కొన్నారు.