శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా ఎయిర్ పోర్టుకు మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయట్లేదని ప్రకటించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని వెల్లడించారు.
నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్‌కు లింక్ చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని చెప్పారు. కొత్త మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ కాగలవని స్పష్టం చేశారు.
ఫార్మాసిటీ, రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు పర్యావరణహిత ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్లస్టర్లలో పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణం చేపడతామని, యువతకు స్కిల్ పెంచేందుకు ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని వివరించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యువతకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరణ చేశామని చెబుతూ ఉమ్మడి జిల్లాలకు ఇన్ ఛార్జ్ లుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించామని గుర్తు చేశారు. 100 పడకల ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఏర్పాటుచేస్తామని తెలిపారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని, ఇతర దేశాలకు అవసరమైన మ్యాన్‌పవర్‌ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని పేర్కొంటూ దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భరోసా వ్యక్తం చేశారు.
పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 3న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని చెబుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పదవులు కల్పిస్తామని స్పష్టంచేశారు. తనకు దగ్గరనో, బంధువులనో పదవులు ఇచ్చేది ఉండదని చెప్పారు.
ప్రెస్ అకాడమీ ఛైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ కమిషనరేట్లకు కమిషనర్లను నియమించామని చెబుతూ ఈ కమిషనర్లకు వారికీ అవసరమైన మ్యాన్‌పవర్‌ను వాళ్లే ఎంపిక చేసుకుంటారని చెప్పారు.
ప్రతిభ కలిగిన అధికారులను విభాగాధిపతులుగా నియమిస్తామని, వాళ్ల పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకుని సక్రమంగా పనిచేసేటట్లు చూసుకోవాలని అధికారులకు సూచించారు. అధికారుల నియామకాల్లో కూడా సామాజిక న్యాయం జరిగేట్లు చూస్తామని, జర్నలిస్టులకు సంబంధించిన అన్ని సమస్యలను వంద రోజుల్లో పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.