ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో టికెట్ల హామీ దక్కని నేతలు పార్టీలు మారుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య టీడీపీలో చేరారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి, తన సోదరుడు గడికోట సురేంద్రనాథ్ రెడ్డి, పలువురు కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ చేరారు.
వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా టీడీపీలో చేరారు. చంద్రబాబు వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కడప జిల్లా రాజంపేట నియోజవకర్గానికి చెందిన సి. రామచంద్రయ్య 1981లో టిడిపి ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. గతంలో రాజ్యసభ సభ్యునిగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశారు.
రాయలసీమ ప్రాంతానికి చెందిన బలిజ నేతగా, సీనియర్ నాయకుడిగా సి.రామచంద్రయ్య పేరుంది. ప్రస్తుతం వైసీపీలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటీవల వైసీపీ కార్యక్రమాలకు రామచంద్రయ్య దూరంగా ఉంటున్నారు. సి.రామచంద్రయ్య టీడీపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన భార్య మినహా మిగిలిన కుటుంబ సభ్యులంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి టీడీపీలో చేరారు. విజయసాయి రెడ్డిని టీడీపీలోకి రమ్మని ఆహ్వానించే హక్కు తనకుందని ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. వైసీపీలో పలుమార్లు టికెట్ ఇస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు.
రాయచోటి టికెట్ ఇవ్వకపోయినా, నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పి మోసాగించారని ధ్వజమెత్తారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ద్వారకానాథ్ రెడ్డి చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు సీఎం జగన్ పాలనకు అసలు పొంతనే లేదని విమర్శించారు.
సీఎంవోలో విజయసాయి రెడ్డితో కలిపి మరో నలుగురు కలెక్షన్ ఏజెంట్లు ఉన్నారని ఆరోపించారు. మరోవంక, సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముందే టీడీపీ నేత బీటెక్ రవితో షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీటెక్ రవి వైఎస్ కుటుంబంపై పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. పులివెందులలో సీఎం జనగ్ ప్రత్యర్థితో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.