ఈ నెల 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం జరగనున్న సందర్భంగా అంతకు ముందుగానే అయోధ్యలో అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాన్ని నిర్వహించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది.
జవనరి 19 నుంచి 21వ తేదీ మధ్యన జరిగే ఈ ఉత్సవం కోసం అయోధ్య అభివృద్ధి సంస్థ(ఎడిఎ) సన్నాహాలు ప్రారంభించింది. గాలిపటాలు ఎగురవేయడంలో నిష్ణాతులైన దేశ విదేశాలకు చెందిన ప్రముఖులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్న ఒక అధికారిక ప్రకటన పేర్కొంది.
ఈ ఉత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు దేశ విదేశాలల్లో జరిగిన వివిధ పతంగుల ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నట్లు ప్రకటనలో తెలిపారు. దీని నిర్వహణ కోసం ప్రైవేట్ ఏజెన్సీల నుంచి దరకాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎడిఎ తెలిపింది. జనవరి 8వ తేదీలోగా ఏజెన్సీ నియామక ప్రక్రియ పూర్తి కాగలదని తెలిపింది.
750 మంది సందర్శకులు కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాట్లు రూపొందిస్తామని, అలాగే 5 మంది ప్రత్యేక ఆహ్వానితుల కోసం ప్రత్యేక విఐపి లాంజ్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఆహ్వానితులకు చిరుధాన్యాలతో తయారుచేసిన వంటకాలతోపాటు, అవధి రుచులను ఆస్వాదించే అవకాశం లభిస్తుందని ప్రకటనలో తెలిపింది.
అయోధ్య వీధుల్లో ఊరేగనున్న రామయ్య
కాగా, అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయంలో ప్రతిష్ఠించే శ్రీరాముని విగ్రహం గురించి ఈ నెల 17న బహిర్గతపరుస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ, ఉడుపి పెజావర్ మఠానికి చెందిన విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ తెలిపారు.
బ్లాక్ స్టోన్‌తో రెండు విగ్రహాలను, గ్రానైట్ స్టోన్‌తో ఒక విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేసినట్లు తెలిపారు. వీటిలో దేనిని రామాలయంలో ప్రతిష్ఠించాలో నిర్ణయించేందుకు ట్రస్టు సభ్యులంతా ఓట్లు వేశారని చెప్పారు. ఎంపికైన విగ్రహాన్ని సరయూ నదీ జలాలతో అభిషేకం చేస్తామని, అదే రోజున వెల్లడిస్తామని చెప్పారు.