విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఎవ్వరికీ వారుగా వాదనలు వినిపించాయి. ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజరుభల్లా వర్చువల్‌గా నిర్వహించిన ఈ సమావేశంలో ఎపి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమేశ్ కుమార్, సమీర్ శర్మ పాల్గన్నారు.
విభజన వల్ల అన్ని విధాల నష్టపోయన తమను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ కోరగా, విభజన చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పలు కేసులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ డిమాండ్ చేశారు.
చట్టంలో ప్రస్తావించని సంస్థలు, బకాయిల కోసం విభజన చట్టాన్ని మరోసారి సవరించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ తిరస్కరించింది. దీంతో తాము నష్టపోతున్న మొత్తాన్ని కేంద్రమే చెల్లించాలని ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.
మరోవంక, సింగరేణి సంస్థలో వాటా కావాలన్న ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తినీ టి.సర్కారు తిరస్కరించింది. ఈ విషయమై ఇరువురి వాదనలు విన్న అజయ్ భల్లా తెలంగాణ వాదనలోని బలమున్నదని, చట్టబద్దత ఉన్నదని స్పష్టం చేసిన్నట్లు తెలిసింది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో తెలంగాణ రాష్ట్రానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటాలున్నాయేగానీ ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది విభజన చట్ట ప్రకారమే ఉన్న నిబంధనని, దీనిపై ఏపీ ప్రభుత్వం అడ్డంతిరిగి వాదించడంలో అర్ధంలేదని సోమేష్ కుమార్ తేల్చి చెప్పారు.
కాగా, రిసోర్స్ ఫండ్ గ్యాపింగ్ నిధులతోపాటు పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులు వెంటనే ఇవ్వాలని సమీర్ శర్మ కోరారు. పిలో గ్రీన్‌ఫీల్డు క్రూడ్ అయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దాలని కోరారు.
దుగరాజపట్నం ఓడరేవుకు బదులుగా రామాయపట్నం రేవును అభివృద్ధి చేయాలని. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్(విసిఐసి) పనులు పూర్తి చేయాలని, కేంద్రం నుండి రావాల్సిన పన్ను రాయితీలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఎపి జెన్కోకు తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన ఆరు వేల కోట్ల రూపాయలను వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అయితే తెలంగాణ విభజన చట్టానికి నూరుశాతం కట్టుబడి ఉన్నట్లు వాదించిన సోమేశ్‌కుమార్ చట్ట సవరణను పూర్తిగా వ్యతిరేకించారు. దీనివల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. విభజన చట్టాన్ని వివాదాస్పదం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన వివిధ కేసులను ఉపసంహరించుకుంటేనే 9,10 షెడ్యూళ్లలో తలెత్తిన సమస్యల సామరస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.
విద్యుత్ బకాయిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే రూ 12,111 కోట్లు తెలంగాణకు చెల్లించాల్సిఉందని చెప్పారు. . ఢిల్లీలోని తెలంగాణ భవన్ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల అధికారులతో కమటీ వేయాలని సూచించారు.
కేంద్ర పథకాలకు సంబంధించిన నిధుల్లో రూ 495 కోట్లు రూపాయలు ఏపీ ప్రభుత్వం విధిగా తెలంగాణకు చెల్లించాల్సి ఉందని, ఏడు సంవత్సరాలుగా ఈ బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. అదే విధంగా హైకోర్టు, రాజభవన్ తదితర ఉమ్మడి సంస్థలపై రూ 315 కోట్ల ఖర్చుకు సంబంధించిన సొమ్ముపై ఏపీ తమకు బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు.
నిర్మాణాల్లో ఉన్న భవనాలపై వాటా, సంక్షేమ నిధిలోని రూ 456 కోట్లు, రూ 208 కోట్ల నికర క్రెడిట్ ఫార్వార్డ్‌ను పునఃప్రారంభించడం వంటి పరస్పరం ఆమోదం పొందిన నిధులను కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వడంలేదని సోమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు.