ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై అధ్యయనం చేసేందుకు ఓసారి కేంద్ర ఎన్నికల అధికారుల బృందం పర్యటించగా, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంలో కీలకమైన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)తో పాటు ఇతర కమిషనర్లు కూడా రానున్నారు.
సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వారు పర్యటిస్తారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి పర్యటించే ఈసీ బృందంలో ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఎన్నికల కమిషనర్లుఅనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్, మరికొందరు అధికారులు ఉన్నారు.
వీరు ఇవాళ రాష్ట్రానికి చేరుకుని మూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేస్తారు. ఇవాళ సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో భేటీ అయి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించనున్న ఈసీ బృందం, రేపు రాజకీయ పార్టీలను చర్చలకు ఆహ్వానిస్తుంది.
రాష్ట్రంలో ఓటర్ల జాబితాల తయారీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఈసీ ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారాయి. ఇప్పటికే అధికార వైసీపీతో పాటు విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన కూడా ఓటర్ల జాబితాపై పలు ఫిర్యాదులు చేశాయి.
వీటిపై చర్యలు తీసుకుంటున్నట్లు సీఈవో చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం కనిపించకపోవడంతో తిరిగి రాజకీయ పార్టీలు పదే పదే ఫిర్యాదులు చేస్తున్నాయి. మంగళవారం రాజకీయ పార్టీలతో నిర్వహించే సీఈసీ నిర్వహించే భేటీలోనూ ఇదే కీలకంగా మారబోతోంది. అయితే ఇంత తక్కువ సమయంలో సీఈసీ కూడా చేసేదేమీ లేదని చెప్తున్నారు.
కానీ రాజకీయ పార్టీలతో భేటీ తర్వాత బుధవారం ఈ వ్యవహారాలపై ఈసీ ప్రత్యేక సమీక్ష నిర్వహించనుంది. ఇందులో ఇచ్చే ఆదేశాల ఆధారంగా సీఈవో చర్యలు తీసుకుంటారు. ఎల్లుండి సీఈసీ బృందానికి సీఈవో ముకేష్ కుమార్ మీనా ఎన్నికల సన్నద్ధతపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారు. అదే రోజు ఓటర్ల జాబితాలో అవకతవకలపై విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ సీఈసీని కలిసి మరో ఫిర్యాదు చేస్తారు.