ఢిల్లీలో కాలుష్యం తీవ్రమవడంతో వాయు నాణ్యత అధ్వాన్నంగా మారింది. అనేక ప్రాంతాలలో విజిబిలిటీ (దృశ్యమాన్యత) స్థాయిలు సున్నాకు పడిపోయింది. దీంతో కేంద్రం ఆదివారం పలు ఆంక్షలు విధించింది. ఢిల్లీ, ఎన్‌సిఆర్ పరిధిలో నిర్మాణాలపై కేంద్రం నిషేధం విధించింది.
బిఎస్-3 పెట్రోల్, బిఎస్-4 డీజిల్ ఫోర్ వీలర్లను నడపడంపై కూడా నిషేధం విధించింది. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రజలను హెచ్చరించింది.
శనివారం రాత్రి 10 గంటల నుండి పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు ఐఎండి అధికారి ఒకరు తెలిపారు. పంజాబ్ మరియు ఉత్తర రాజస్థాన్ నుండి ఈశాన్యం వరకు దట్టమైన పొగమంచుతో కప్పేసిన దృశ్యాలు శాటిలైట్‌లో కనిపించాయి.
గంగానగర్, పాటియాలా, అంబాలా, చంఢగీఢ్, ఢిల్లీ, బరేలీ, లక్నో, బహ్రైచ్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, తేజ్‌పూర్ మీదుగా అమృత్సర్ నుండి దిబ్రూగఢ్ వరకు జీరో విజిబిలిటీ నమోదవడం ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ శీతాకాలంలో అతి చల్లని వాతావరణం ఆదివారం ఢిల్లీలో నమోదైంది. కనీస ఉష్ణోగ్రత 3.5 సెల్షియస్ డిగ్రీలకు పడిపోయింది. ఇక లోఢీ రోడ్ ప్రాంతంలోనైతే 3.4 సెల్షియస్ డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది.
పొగమంచు కారణంగా ఢిల్లీకి చేరుకునే 22 రైళ్ల షెడ్యూల్‌పై ప్రభావం చూపిందని రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనూ పాలమ్ అబ్జర్వేటరీ ఉదయం 5 గంటలకు దట్టమైన పొగమంచుతో దృశ్యమాన్యత స్థాయిలు సున్నా మీటర్లకు పడిపోయాయి. ఏడు విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజిఐ) విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులకూ దట్టమైన పొగమంచు కారణంగా అంతరాయం కలిగింది. ‘ఉత్తరాదిలోని వాతావరణపరమైన సవాళ్ల కారణంగా మా విమాన సర్వీసులకు అంతరాయం వాటిల్లవచ్చు’ అని ఇండిగో విమాన సంస్థ ‘ఎక్స్’లో సూచించింది. ఉత్తరాదిలోని పలు ప్రాంతాలలో రానున్న మూడు నాలుగు రోజుల్లో దట్టమైన పొగమంచు, శీతగాలుల పరిస్థితులు తగ్గకపోవచ్చునని వాతావరణ శాఖ సూచించింది.