ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు సోమవారం రాజీనామా చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన రాజీనామా లేఖను పంపించారు. దానితో కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం అయినట్లయింది.
మరికొద్దిరోజుల్లోనే షర్మిలను ఆ పదవిలో నియమించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ పదవిపై షర్మిలకు ఇప్పటికే ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశాల మేరకే రుద్రరాజు తప్పుకున్నారని సమాచారం. తెలంగాణ కేంద్రంగా వైఎస్ఆర్ తెలంగాణ పేరిట గతంలో కొత్త పార్టీ పెట్టిన షర్మిల అసెంబ్లీ ఎన్నికల వేళ పోటీ చేయడం లేదని ప్రకటించి తప్పుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడా ప్రకటించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కలిసిన షర్మిల పార్టీ విలీనంపైనా చర్చలు జరిపినట్లు తెలిసింది. తర్వాత ఇటీవల ఢిల్లీకి వెళ్లిన షర్మిల ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు కూడా ఆమె ప్రకటించారు.
అయితే కాంగ్రెస్లో చేరినప్పటికీ షర్మిలకు ఇప్పటివరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు అధిష్టానం. ఇదివరకు తెలంగాణ రాజకీయాల్లో షర్మిల తనకంటూ ప్రత్యేక మార్క్ సృష్టించుకున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గిడుగు రుద్రరాజు తప్పుకోగా,త్వరలోనే షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు.