దేశవ్యాప్తంగా పలు చోట్ల మంచు కారణంగా విమానాలు ఆలస్యం, రద్దవుతున్న నేపథ్యంలో ప్రయాణికులకూ, విమానయాన సంస్ధల సిబ్బందికీ మధ్య వాగ్వాదాలు, దాడులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి గోవా వెళ్లే ఇండిగో విమానంలో పైలట్ పై విమాన ఆలస్యానికి ఆగ్రహం చెందిన ఓ ప్రయాణికుడు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో కేంద్రం కూడా స్పందించి ప్రయాణికులు సంయమనం పాటించాలని కోరింది. దీనికి కొనసాగింపుగా డీజీసీఏ కూడా విమానయాన సంస్ధలకు తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో విమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించిన సమాచారాన్ని సక్రమంగా ప్రయాణికులకు అందించాలని విమానయాన సంస్ధల్ని ఆదేశించింది.
మూడు గంటలకు మించి విమానాలు ఆలస్యమైతే వాటిని రద్దు చేసుకునేందుకు కూడా విమానయాన సంస్ధలకు డీజీసీఏ వీలు కల్పించింది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది.విమానయాన సంస్థలు తమ విమానాల జాప్యాలకు సంబంధించి రియల్ టైం సమాచారాన్ని వెల్లడించాలని కూడా డీజీసీఏ విడుదల చేసిన ఎస్‌వోపీలో పేర్కొంది.
అలాగే సదరు ఎయిర్‌లైన్ సంబంధిత వెబ్సైట్, బాధిత ప్రయాణీకులకు మెసేజ్ లేదా వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరింది. అలాగే ఎయిర్ పోర్టుల్లో వేచి ఉన్న ప్రయాణీకులకు విమాన ఆలస్యం గురించి తాజా సమాచారాన్ని ప్రదర్శించడం, విమానాల ఆలస్యం గురించి ప్రయాణీకులతో తగిన విధంగా కమ్యూనికేట్ చేయడానికి, నిరంతరం మార్గనిర్దేశం చేయడానికి, ఎయిర్‌లైన్ సిబ్బందికి తగిన అవగాహన కల్పించడానికి ప్రయత్నించాలని ఆదేశించింది.