ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న షాహి ఈద్గా మసీదులో సర్వే చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. సర్వే కోసం కమీషనర్‌ను నియమించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇచ్చింది. శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మసీదును నిర్మించినట్లు కొందరు పిటీషనర్లు కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
లక్నోకు చెందిన అడ్వకేట్ రంజనా అగ్నిహోత్రి 2020లో ఆ కేసును దాఖలు చేశారు. 13.37 ఎకరాల వివాదాస్పద స్థలంలో మసీదును నిర్మించినట్లు ఆరోపించారు. అక్కడే కట్రా కేశవ్ దేవ్ ఆలయం ఉన్నది. ఈ స్థలంలోనే కృష్ణుడు జన్మించిన చెరశాల ఉన్నట్లు పిటీషన్లో వాదించారు. ఈద్గాలో సర్వే చేపట్టాలని హిందువులు వేసిన పిటీషన్‌ను ముస్లింలు వ్యతిరేకించారు.
మసీదులో సర్వే నిర్వహిస్తే గతంలో గుడిపై దీన్ని నిర్మించిన విషయం తేలుతుందంటూ హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అలాహాబాద్ హైకోర్టు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. అయితే దీన్ని మంగళవారం సుప్రీంకోర్టు నిలిపేసింది. 17వ శతాబ్దం నాటి షాహీ ఈద్గా మసీదులో సర్వే నిర్వహణ కోసం అడ్వకేట్ కమిషనర్ ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో జ్ఞానవాపి మసీదులో సర్వేకు అనుమతి ఇచ్చినట్లే ఈసారి షాహీ ఈద్గా మసీదులోనూ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సర్వేను తాత్కాలికంగా నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
చరిత్రలో శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మసీదు నిర్మించారని హిందూ సంఘాలు సర్వే చేయాలని పట్టుబట్టాయి. గతంలో ఉన్న కాట్రా కేశవ్ దేవ్ ఆలయాన్ని కూల్చివేసి శతాబ్దాల నాటి మసీదును నిర్మించారని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశాయి. వివాదాస్పద 13.37 ఎకరాల భూమిపై పూర్తి యాజమాన్యం కావాలని హిందూ పక్షం మధుర కోర్టును కోరింది.
ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు గుడిని కూల్చేసి మసీదు నిర్మించారని వారు పిటిషన్లో ఆరోపించారు. ఈ డిమాండ్‌ను గత ఏడాది డిసెంబర్లో మధుర స్థానిక కోర్టు అంగీకరించింది. అయితే ముస్లిం సంఘాలు దీన్ని హైకోర్టులో సవాల్ చేశాయి.