పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌పై మంగళవారం రాత్రి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దావోస్‌లో పాకిస్థాన్ తాత్కాలిక ముఖ్యమంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిర్ అబ్దుల్లాహియాన్ సమావేశమైన కొన్నిగంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
వెయ్యికిలోమీటర్ల మేర పరుచుకున్న రెండు దేశాల ఉమ్మడి సరిహద్దుకు సమీపంలో నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని పంజ్గూర్ ప్రాంతంలో ఈదాడి జరిగినట్లు పాకిస్థాన్ తెలిపింది. ఇద్దరు చిన్నారులు మరణించగా, మరో ముగ్గురు బాలికలకు తీవ్రగాయాలైనట్లు తెలిపింది.
ఈ దాడిని ఖండిస్తున్నట్లు పాకిస్థాన్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని, తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వుంటుందని ఆ ప్రకటనలో వెల్లడించింది.
ఇరుదేశాల మధ్య పలు కమ్యూనికేషన్ ఛానెల్‌లు ఉన్నప్పటికీ.. ఈ చట్టవిరుద్ధమైన చర్య జరగడం మరింత ఆందోళన కలిగిస్తుందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదం అన్ని దేశాలకూ తీవ్ర ముప్పు తలపెడుతుందని, దీన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ విధంగా ఏకపక్షంగా వ్యవహరించడం పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీస్తుందని పాకిస్తాన్ హెచ్చరించింది. ద్వైపాక్షిక సంబంధాలకు ముప్పు వాటిల్లే విధంగా ఇరాన్ చర్యలున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇరాన్ రాయబారిని పిలుపించుకొని పాక్ విదేశాంగ కార్యాలయం తమ నిరసనను తెలియజేసింది. తమ దేశ గగనతలాన్ని దుర్వినియోగం చేశారని మండిపడింది.
ఈ దాడిపై ఇరాన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. పాకిస్థాన్‌లోని జైష్ అల్ అదల్ లేదా ఆర్మీ ఆఫ్ జస్టీస్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా క్షిపణి దాడి జరిగిందని, భవనం ధ్వంసమైందని స్థానిక మీడియా తెలిపింది. ఈ గ్రూప్‌ను ఉగ్రవాద సంస్థగా పేర్కొంటూ ఇరాన్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఇరాన్‌పై కూడా దాడులు చేపడుతోంది. గతేడాది డిసెంబర్లో ఇరాన్ పోలీస్ స్టేషన్‌పై చేసిన దాడిలో 11 మంది పోలీస్ అధికారులు మరణించారు.