గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన్నప్పుడు ఆయన చేపట్టిన పాదయాత్రను కొనసాగిస్తూ `జగన్ వదిలిన బాణాన్ని’ అని చెప్పుకున్న వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి, ఎపిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత `జగన్ పై ఎక్కుపెట్టిన బాణం’గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క ఎంపీ లేదా ఎమ్యెల్యే సీటును గెల్చుకొనే సామర్థ్యం లేని కాంగ్రెస్ అవసరమైనప్పుడు జగన్ మోహన్ రెడ్డిని `లొంగదీసుకొనే’ ఎత్తుగడగా షర్మిలను ప్రయోయోగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎపిసిసి అధ్యక్ష పదవి చేపట్టినా ఏపీలో ఎక్కడి నుండి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే సాహసం ఆమె చేయకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
ఆమె దృష్టి అంతా కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నిక కావడం పైననే ఉంది. అయితే, జగన్ మోహన్ రెడ్డికి చికాకు కలిగించేందుకు బాబాయి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతా రెడ్డిని రంగంలోకి దింపేందుకు దృష్టి సారించినట్లు చెబుతున్నారు.
తండ్రి హత్య కేసు దర్యాప్తులో జగన్ మోహన్ రెడ్డి సహకరించక పోవడమే కాకుండా, నిందితులకు బాసటగా నిలబడుతున్నారని సునీతా రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఒంటరిగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఈ కేసులో ఆమె పోరాడుతున్నారు. పలు సందర్భాలలో ఆమెకు షర్మిల సంఘీభావం వ్యక్తం చేశారు కూడా.
ఇప్పుడు ఆమెను కూడా కాంగ్రెస్ లో చేర్చుకొని, కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. మరో బాబాయి కుమారుడైన ప్రస్తుత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు, బెయిల్ పై ఉన్నారు. పైగా, ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడిగా పేరొందారు. ఆయనపై షర్మిల పోటీ చేస్తే కడప రాజకీయాలలో కలకలం రేపినట్లు అవుతుందని భావిస్తున్నారు.
అదే విధంగా, వైసిపిలో సీటు రాదనీ అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలపై కూడా షర్మిల దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన రాజకీయ ప్రయాణం షర్మిల వెంటే ఉంటుందని ప్రకటించారు. ఆమె కాంగ్రెస్ లో చేరితే తనకు కూడా చేరతానని కూడా తెలిపారు. అదేవిధంగా తిరిగి సీటు రాదనీ ఖరారైన విజయవాడ ఎమ్యెల్యే మల్లాది విష్ణు సహితం షర్మిలాతో పాటు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.