సినీ నటి నయనతార చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంటుంది. సరోగసి వివాదం, తిరుమలలో ఫోటో షూట్ల వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇలా నయన్ పేరు ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. నయన్ తీస్తోన్న సినిమాలు సైతం ఈ మధ్య ఎక్కువగా వివాదాలు సృష్టిస్తున్నాయి.
మూకుత్తి అమ్మాన్, అన్నపూరణి చిత్రాలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సీన్లను చిత్రీకరించారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పుడు అన్నపూరణి వివాదం తారాస్థాయికి చేరుకుంది.
ఓటీటీలోకి ఈ మూవీ వచ్చిన తరువాత మరింతగా వివాదం చెలరేగుతుంది. హిందూ సంస్కృతి, ఆచారాలను తక్కువ చేసేలా, హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా సన్నివేశాలున్నాయని మండి పడుతున్నారు. దీంతో నెట్ ఫ్లిక్స్ సైతం ఈ సినిమాను ఆపేసిందని అప్పట్లో టాక్ వచ్చింది.
ఇక ఈ వివాదాల మీద నయన్ స్పందించింది. జై శ్రీరామ్ అంటూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ అందరినీ క్షమాపణలు కోరింది. “ఎవరి ఆచార, సంప్రదాయాలను గానీ సంస్కృతిని గానీ తక్కువ చేయాలనో, కించ పర్చాలనే ఉద్దేశం గానీ తమకు లేదని, తమ సినిమా వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి.. అలా బాధపడ్డ వారందరికీ నేను మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను” అని తెలిపింది.
“నేను దేవుడ్ని నమ్ముతాను.. గుళ్లకు వెళ్తుంటాను.. ఇకపై ఎప్పుడూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాను.. గత రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాను.. పాజిటివిటీని పంచాలి, పెంచాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నాను.. ఉంటున్నాను..” అంటూ నయన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక జై శ్రీరామ్ అంటూ నయన్ విడుదల చేసిన ఈ పోస్ట్ మీద కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం జై శ్రీరామ్ అని ఎందుకు పెట్టావ్.. ఎవరి అటెన్షన్ కోసం పెట్టావ్ అంటూ నయన్ మీద విమర్శలు చేస్తున్నారు. చివరకు నయన్ మాత్రం తన తీరుకు భిన్నంగా దిగొచ్చి ఇలా క్షమాపణలు చెప్పడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.