స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్‌కు షాక్ ఎదురైంది. తొలి టెస్టులో ఇంగ్లిష్ జట్టు చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం భారత్ కొంపముంచింది.
శుభ్‌మన్ గిల్(0), శ్రేయస్ అయ్యర్(13) వైఫల్యం భారత ఓటమని శాసించింది. 231 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 202 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(39), కేఎస్ భరత్(28), అశ్విన్(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ(7/62) ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. జోరూట్, జాక్ లీచ్ తలో వికెట్ తీశారు.
టెస్ట్‌ల్లో ఉప్పల్ మైదానం వేదికగా భారత్‌కు ఇదే తొలి పరాజయం. ఈ ఓటమితో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2న వైజాగ్ వేదికగా ప్రారంభం కానుంది. 231 పరుగుల సాధారణ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మరోసారి దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన యశస్వి జైస్వాల్(15), రోహిత్ శర్మ(39) తమ జోరును కొనసాగించలేకపోయారు.
హార్ట్లీ బౌలింగ్‌లో జైస్వాల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్‌ను హార్ట్లీ సిల్వర్ డక్ చేశాడు. దాంతో భారత్ 2 బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ వికెట్ భారత బ్యాటర్లపై అనవసర ఒత్తిడిని క్రియేట్ చేసింది. ఇదే జోరులో చెలరేగిన హార్ట్లీ నిలకడగా ఆడుతున్న రోహిత్ శర్మ(39)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.