టీటీడీ వార్షిక బడ్జెట్ (2024-25) కు పాలక మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ పాలకమండలి నిర్ణయాలను ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు తెలిపుతూ టీటీడీ వార్షిక బడ్జెట్ ను రూ.5,141.74 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టగా, రూ.5,122.80 కోట్ల బడ్జెట్ను పాలకమండలి ఆమోదించిందని చెప్పారు.
ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవారి పాదాల వద్ద ఉంచిన మంగళ సూత్రాలను (బంగారు డాల్లర్లు) భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులను స్కిల్డ్ లేబర్ గా గుర్తించి జీతం రూ.15 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దేవస్థానంలో ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలలో పనిచేస్తున్న 51 మంది ఉపాధ్యాయుల జీతాలు రూ.35 వేల నుంచి రూ.54 వేలకు పెంచుతున్నట్లు పాలకమండలి ప్రకటించింది.
టీటీడీ ఆలయాలలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుల జీతాలు పెంచుతున్నట్లు పాలకమండలి పేర్కొంది. దీంతో పాటు 56 వేదపారాయణదారుల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వేదపండితుల పింఛన్ రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు.
వచ్చే 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ సదస్సుకు 57 మంది మఠాధిపతులు, పిఠాధిపతులు హాజరుకానున్నారని తెలిపారు. టీటీడీ పాలకమండలి బడ్జెట్ లో ఇంజినీరింగ్ విభాగానికి రూ.350 కోట్లు కేటాయించింది.
హిందూ ధర్మప్రచార, అనుబంధ ప్రాజెక్టులకు రూ.108.50 కోట్లు, టీటీడీ విద్యాసంస్థలు, వివిధ వర్సిటీలకు గ్రాంట్స్ రూ.173.31 కోట్లు కేటాయించింది. వివిధ సంస్థలకు గ్రాంట్స్ రూపంలో రూ.113.50 కోట్లు, పారిశుద్ధ్య విభాగానికి రూ.261.07 కోట్లు, నిఘా, భద్రతా విభాగానికి రూ.149.99 కోట్లు, వైద్య విభాగానికి రూ.241.07 కోట్లు కేటాయించింది.
స్విమ్స్ అస్పత్రిలో 300 పడకల నుంచి 1200 పడకల పెంపునకు రూ.148 కోట్లతో టెండర్ ప్రకటనకు టీటీడీ ఆమోదం తెలిపింది. రూ.2.5 కోట్లతో సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది.
ఎస్ఎంసీతో పాటు పలు కాటేజీల ఆధునీకరణకు రూ.10 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్వేర్ వినియోగానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. అన్నమయ్య భవన్ ఆధునీకరణకు రూ.1.47 కోట్లు కేటాయించింది.