భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత 96 ఏళ్ల లాల్ కృష్ణ అద్వానీని వరించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎల్కే అద్వానీ భారతరత్నకు ఎంపిక అవడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న వరించడం పట్ల తాను అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.
“ఎల్కే అద్వానీ జీకి భారతరత్న ఇవ్వనున్నారని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంపై నేను కూడా అద్వానీజీతో మాట్లాడాను. భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం అయిన భారత రత్న ఆయనకు లభించినందుకు అభినందనలు చెప్పాను. ప్రస్తుత కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో ఎల్కే అద్వానీ ఒకరు. దేశ అభివృద్ధికి అద్వానీజీ చేసిన కృషి ఎనలేనిది. దేశ రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి దేశానికి ఉప ప్రధానమంత్రిగా సేవ చేయడం వరకు ఆయన జీవితం సాగింది. అద్వానీజీ హోం మంత్రిగా పనిచేశారు. పార్లమెంటులో అద్వానీ చేసిన ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటాయి.” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ హయాంలో లాల్ కృష్ణ అద్వాన దేశ ఉప ప్రధానిగా సేవలు అందించారు. అదే సమయంలో పలు కేంద్ర శాఖలకు కూడా మంత్రిగా పని చేశారు. 1970 నుంచి 2019 మధ్య ఎల్కే అద్వానీ పార్లమెంటు ఉభయసభల్లో సభ్యుడిగా ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టి యావత్ దేశాన్ని ఏకం చేసిన వ్యక్తిగా ఎల్కే అద్వానీ చరిత్రలో నిలిచారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశం మొత్తం రథయాత్రను నిర్వహించారు. ఈ రథయాత్ర హిందువులను అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేలా చేసింది. దేశంలో బీజేపీ క్షేత్రస్థాయిలో అత్యంత బలోపేతం కావడానికి, 2014 లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ నేతలైన అటల్ బిహారీ వాజ్‌పేయ్, మురళీ మనోహర్ జోషిలతో కలిసి శక్తివంచన లేకుండా కృషి చేశారు.
భారతీయ జనసంఘ్ ప్రారంభ దినాల నుండి వాజపేయితో కలిసి రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే జనసంఘ్ జనతా పార్టీలో విలీనమై, దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం మొరార్జీ దేశం నేతృత్వంలో ఏర్పడింది. జనతా ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో సహితం వాజపేయితో కలిసి కీలక పాత్ర వహించారు. బిజెపి అధ్యక్షునిగా, పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకునిగా కూడా సేవలు అందించారు.
ఇటీవలె బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. తాజాగా ఎల్కే అద్వానీ పేరును దేశ అత్యున్నత పౌర పురస్కారం కోసం ఎంపిక చేసింది. గతంలో మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయికి ఈ పురస్కారం వరించింది.