దేశంలోని చాలా రాష్ట్రాల్లో పోటీ పరీక్ష పేపర్ల లీకేజీ ఘటననలు తరచూ చోటు చేసుకుంటుండంతో అనేకమంది ఉద్యోగార్థులు నిరాశ నిస్పృహకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లీకేజీ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం అమలు చేసేందుకు సిద్ధమైంది.
ఇకపై పోటీ పరీక్షల్లో అవకతవకలకు, లీకేజీలకు పాల్పడే వారిపై కేంద్రం కఠిన శిక్షలు విధించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంస్థలు నిర్వహించే పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రవెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు, 2024’ను మంగళవారం లోక్‌సభ ఆమోదించింది.
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ దీన్ని సభలో ప్రవేశపెడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులు, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించిన బిల్లుగా దీన్ని పేర్కొన్నారు. ఈ బిల్లుకు సంబంధించి విపక్ష సభ్యులు ప్రతిపాదించిన కొన్ని సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం లోక్‌సభ దీన్ని ఆమోదించింది.
ఇది అమల్లోకి వస్తే పేపర్ లీకేజీ పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా, నకిలీ వెబ్సైట్లను సృష్టించినా గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ. కోటి వరకూ జరిమానా పడనుంది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎన్న్టీఏ వంటి పోటీ పరీక్షలతోపాటు నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి ప్రవేశపరీక్షలకూ వర్తిస్తుంది.
తాజా చట్టం వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపుతుంది. వారితో చేతులు కలిపిన ప్రభుత్వ అధికారులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
అయితే పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు లేదా అభ్యర్థులు ఈ చట్టం పరిధిలోకి రారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో చెప్పారు. గ్రూపులు, ముఠాలు, వ్యవస్థీకృత మాఫియాగా ఏర్పడి పేపల్ లీకేజీ వంటి అక్రమాల్లో పాల్పడే వారికే ఈ చట్టంలోని శిక్షలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.