డ్రగ్స్ విక్రయిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 557గ్రాముల కొకైన్, ఎక్టసీ పిల్స్ 902, హెరాయిన్ 21 గ్రాములు, వీడ్ గంజా 45 గ్రాములు, ఎల్ఎస్డి బ్లోట్స్ 105, చరాస్ 215 గ్రాములు, అంఫెటమైన్ 7 గ్రాములు, గంజా 190 గ్రాములు, రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్, ఎనిమిది మొబైల్ ఫోన్లు, రూ.5.40లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
వెస్ట్‌జోన్ డిసిపి ఎస్ఎం విజయ్‌కుమార్ ప్రకారం నైజీరియా అనంబ్రా రాష్ట్రం, ఒనిట్షా ఇచిడాస్ట్రీట్కు చెందిన ఇవులా ఉకోడా స్టాన్లీ(43) బిజినెస్ వీసాపై 2009లో భారత్ కు వచ్చాడు. ముంబాయిలోని అందేరీలో ఉంటూ ఓ స్నేహితుడితో కలిసి రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఏడాది తర్వాత గోవాలోని కండోలిమ్‌కు చేరుకొని అక్కడే కొందరు నైజీరియన్లతో కలిసి దుస్తుల వ్యాపారం చేశాడు.
అక్కడ ఉన్ కొందరు నైజీరియన్లు డ్రగ్స్ విక్రయిస్తు భారీగా డబ్బులు సంపాదించాడం చూశాడు. ముంబాయిలోని నైజీరియన్ల నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేసి గోవాకు తెప్పించి పర్యాటకులకు విక్రయించడం ప్రారంభించాడు. ఇలా 15 సంవత్సరాల నుంచి డ్రగ్స్ విక్రయిస్తు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్‌గా ఎదిగాడు.
తన డ్రగ్స్ వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాడు. నిందితుడికి దేశవ్యాప్తంగా 500మంది డ్రగ్స్ కస్టమర్లు ఉన్నారు. అందులో ఏడుగురు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. డ్రగ్స్ విక్రయించేందుకు స్టాన్లీ హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులకు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన టీఎస్‌న్యాబ్, హెచ్‌న్యూ, ఏసీపీ మోహన్ కుమార్ నేతృత్వంలో పంజాగుట్ట పోలీసు అధికారులు సంయుక్తంగా వేట ప్రారంభించారు.
ఎట్టకేలకు నిందితుడిని ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద అరెస్టు చేశారు. స్టాన్లీ డ్రగ్స్‌ను కేవలం గోవా, ముంబాయిలో ఉంటున్న నైజీరియన్ల వద్ద నుంచి మాత్రమే కొనుగోలు చేసేవాడు. స్టాన్లీ వీసా గడువు ముగిసినా అక్రమంగా భారత్ లో ఉండడంతో గోవా పోలీసులు అరెస్టు చేశారు. ఆరు నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు.
తర్వాత రాజస్థాన్‌కు చెందిన భారతకు విడాకులిచ్చినా ఉషా చండేల్ అనే మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. స్టాన్లీ డ్రగ్స్ వ్యాపారం తెలియడంతో 2017లో ఎన్‌సిబి, గోవా పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ డ్రగ్స్ వ్యాపారం చేయడం ప్రారంభించాడు.
డ్రగ్స్ కేసులో గతంలో ఎస్ఆర్ నగర్ పోలీసులు గోవాకు చెందిన బాబుసో దివాకర్ అలియాస్ బాబా అలియాస్ బాబును అరెస్టు చేశారు. ఈ సమయంలో స్టాన్లీ పేరు బయటికి వచ్చింది. టిఎస్ నాబ్‌కు చెందిన ఎస్సై, ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు గోవాకు వెళ్లి స్టాన్లీ కదలికలపై నిఘా పెట్టారు. అదే సమయంలో స్టాన్లీ మొబైల్ నంబర్లను సేకరించి, టవర్ లొకేషన్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. ఈ క్రమంలోనే స్టాన్లీ డ్రగ్స్ సరఫరా చేసేందుకు హైదరాబాద్‌కు వస్తున్నట్లు పోలీసులు తెలుసుకొని, ఇక్కడికి రాగానే పోలీసులు పట్టుకున్నారు.