గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. మహాత్మగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని బుగ్గన ప్రారంభించారు. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కినందకు సంతోషం వ్యక్తం చేశారు.
గత ఐదేళల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటుగా సాధించిన విజయాలను ప్రసంగంలో ప్రస్తావించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ఆయన మాటల్లో ఆ విజయాలు ఇలా ఉన్నాయి. 2018-19 సంవత్సరంలో 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో 14వ స్థానంలో ఉండగా.. 2023 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 16.2%నికి పెరగటం వలన 4వ స్టానానికి పురోగతి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానం కైవసం చేసుకుంది.
2018-19 సంవత్సరంలో రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో 12వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు రాష్ట్రం 13% వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ది రేటుతో 6వ స్థానంలో ఉంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపచేసిన మొదటి, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
రాష్ట్రంలో 13 లక్షల 5 వేల మంది రైతులకు సేవలను అందిస్తూ, రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకుచే ప్రశంసలు అందుకున్నాయి. ఇథియోపియా, బంగ్లాదేశ్ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు రాష్ట్రంలో రైతులకు విత్తనం నుంచి అమ్మకం వరకు అందిస్తున్న భరోసాను చూసి తమ తమ దేశాలలో అనుకరించాలనుకుంటున్నారు.
సూక్ష్మ నీటిపారుదల పద్ధతి అమలులో రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. అంతే కాకుండా దేశంలోని మొదటి 15 జిల్లాలలో, 6 జిల్లాలు రాష్ట్రం నుంచే ఉన్నాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్)- జాతీయ అరటి పరిశోధన సంస్థల నుంచి ఎగుమతి కార్యకలాపాలకు ఉత్తమ రాష్ట్ర అవార్డును రాష్ట్రం గెలుచుకుంది.
2019 సంవత్సరానికి ముందు 387 మెట్రిక్ టన్నుల అరటిని మాత్రమే ఎగుమతి చేయగా.. ఇప్పుడు ఒక లక్ష 67 వేల మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతిని చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం చేపల ఉత్పత్తిలో 30% వాటాతో.. మొత్తం సముద్ర ఆహార ఎగుమతులలో 31% తో దేశంలోనే ముందంజలో ఉంది. అందుకు ఫలితంగా 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డును అందుకుంది.
పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకుగాను, శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం, తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) నుంచి బ్రీడ్ కన్షర్వేషన్ అవార్డును అందుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో రాష్ట్రం ౩వ స్థానంలో ఉంది.
కొత్త సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రిజిస్ట్రేషన్లు 2020 సంవత్సరంలో 65,174 నమోదు కాగా.. 2023 సంవత్సరంలో ఈ రిజిస్ట్రేషన్లు 7 లక్షల 20 వేలకు పెరిగాయి. దేశంలో 5% వాటాతో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది.
2017 సంవత్సరానికి ఒక లక్ష 17 వేల మంది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలలో ఉపాధి పొందుతుండగా, ఉద్యమ్ పోర్టల్ క్రింద ఈ ఉపాధి కల్పన 2023 సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి, ఈ తరహా సంస్థలలో 277 లక్షల 45 వేల మంది ఉద్యోగులు ఉపాధిని పొందుతున్నారు.
రాష్ట్రంలో ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి క్రింద ఉప్పాడ జమ్జానీ చీరలకు బంగారు బహుమతిని పొందటమే కాకుండా, చేనేత ఉత్పత్తుల క్రింద మరో నాలుగు అవార్జులను అందుకుంది. ప్రధాన మంత్రి పట్టణ ఆవాస యోజన క్రింద ఉత్తమ పనితీరు అవార్డును ఆంధ్రప్రదేశ్ అందుకుంది. అదే విధంగా, రాష్ట్రానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులు ప్రధానమంత్రి నుంచి ఉత్తమ గృహ నిర్మాణ అవార్డులను అందుకున్నారు.
సంపూర్ణ పోషణం పథకం ద్వారా గర్భిణీలకు మేలు జరుగుతుందని, 99.81 పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించామని, జగన్న గోరుముద్ద కోసం రూ.1910 కోట్లు ఖర్చు చేశామని ప్రకటించారు. 10,893 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించామని, 10,216 వ్యవసాయ గోదాములు నిర్మించామని, 82299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించామని బుగ్గన చెప్పారు.
వైఎస్ఆర్ కల్యాణ మస్తు షాదీ తోపా కింద రూ.350 కోట్లు, కాపు నేస్తం ద్వారా రూ.2029 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా రూ.1268 కోట్లు పంపిణీ చేశామని వివరించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం ద్రవ్యలోటు ఉండగా జిఎస్డిపిలో రెవెన్యూ లోటు 1.56 శాతంగా ఉందని బుగ్గన వెల్లడించారు.