తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి తమకు అప్పగించారని, ప్రస్తుతం రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గురువారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని పేర్కొంటూ దశాబ్ధకాంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తామని ఆమె తెలిపారు.
“ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారు. ప్రగతిభవన్ ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చింది. ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం. ప్రజాపాలనలో కోటి 80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తాం. ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. అర్హులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం” అంటూ గవర్నర్ భరోసా ఇచ్చారు.
రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అములుకు కట్టుబడి ఉన్నామని చెబుతూ దశాబ్ధకాంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తామని తెలిపారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని పేర్కొంటూ టీఎస్పీఎస్సీ, ఎస్ హెచ్ ఆర్ సి వంటి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తామని ఆమె ప్రకటించారు.
గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని గుర్తు చేస్తూ ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుంటోందని ఆమె చెప్పారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతామని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం, మౌళిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తామని డా. తమిళసై తెలిపారు. ఇంటర్నెట్ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతూ ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని, మూసీని అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తామని, మూసీ నది ప్రక్షాళనలకు ప్రణాళిక రూపొందించామని, ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్‌గా హుస్సేన్‌సాగర్, లక్నవరంలను మారుస్తామని, త్వరలో గ్రీన్ ఎనర్జీని తీసుకువస్తామని, టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తామని గవర్నర్ వివరించారు.
దేశానికి హైదరాబాద్‌ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని ఆమె వెల్లడించారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొస్తామని, వెయ్యి ఎకరాల్లో 10-12 ఫార్మా విలేజీలు నిర్మిస్తామని గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు.
గవర్నర్ ప్రసంగం తర్వాత తొలిరోజు సభ వాయిదా పడగా, శుక్రవారం ధన్యవాద చర్చను ప్రారంభించనున్నారు. అయితే తొలిరోజు సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాలేదు. తొలుత ఆయన వస్తారని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో ఆయన సభకు హాజరు కాలేదు. ఈనెల 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా, ఆ రోజు కేసీఆర్ సభకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.