ఇన్నర్ రింగ్‌రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో ఎ-1 ముద్దాయిగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును పేర్కొంటూ ఎసిబి కోర్టులో సిఐడి గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఎ-2గా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. వీరితోపాటు నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్‌ను ముద్దాయిలుగా సిఐడి పేర్కొంది.
సింగపూర్‌తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందమని తెలిపింది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అంటూ తప్పుదారి పట్టించినట్టు సిఐడి తెలిపింది. అయితే జి2జి ఒప్పందమే జరగలేదని సిఐడి నిర్ధారించింది. సింగపూర్‌తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని పేర్కొంది.
చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్‌కు డబ్బులు చెల్లింపులు జరిగినట్టు నిర్ధారణ చేసింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్‌రోడ్డు, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్లు రూపొందించినట్టు పేర్కొంది. ఇన్నర్ రింగ్‌రోడ్డును లింగమనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్టు సిఐడి ఛార్జిషీట్లో వెల్లడించింది.
’58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొన్నారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకు మేలు చేసేలా అలైన్మెంట్ మార్పులు చేశారు. లింగమనేని నుండి చంద్రబాబుకు ఇంటిని ఇచ్చారు’ అని సిఐడి తెలిపింది. లింగమనేని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ 14 ఎకరాల భూములు కొన్నట్టు పేర్కొంది. ఈ భూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్చినట్టు తెలిపింది.