పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడి కాలేదు. ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాలు కన్పిస్తున్నాయి. పిటిఐ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక సీట్లు సొంతం చేసుకున్నారు.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు ఉన్నాయి. 336 సీట్లలో నేరుగా 266 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. మిగితా 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయించారు. పాకిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటుకు 133 సీట్లు కావాల్సిఉంది.
ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు 98 చోట్ల సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 69 సీట్లతో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్)- పీఎంఎల్-ఎన్ రెండో స్థానంలో, 51 సీట్లతో బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నిలిచింది.
ఇమ్రాన్ ఖాన్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించి, పీటీఐ ఎన్నికల గుర్తు బ్యాట్‌ను పాక్ ఎన్నికల సంఘం రద్దుచేసింది. దీంతో పీటీఐ తరఫున నేరుగా అభ్యర్థులు పోటీచేయకుండా స్వతంత్రులుగా నామినేషన్ వేసి ఎన్నికల్లో నిలిచారు.
అయితే, యువ ఓటర్లు ఇమ్రాన్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. జైల్లో ఉండటం వల్ల ప్రత్యక్షంగా ఇమ్రాన్ ప్రచారం నిర్వహించలేకపోయారు. సామాజిక మాధ్యమాలు, ఏఐ వంటి సాంకేతికత సాయంతో ప్రచారం నిర్వహించారు.
అయితే, తన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ జాతీయ ఎన్నికల్లో విజయం సాధించిందని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించామని స్పష్టం చేశారు. అయితే తమ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయి అనేది మాత్రం తెలపలేదు. ఇక మిగిలిన పార్టీలతో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చిస్తామని నవాజ్ షరీఫ్ శుక్రవారం ప్రకటించారు.