టోల్ ప్లాజాల దగ్గర మాన్యువల్‌గా టోల్ ఛార్జీల వసూలువల్ల రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోతుండటంతో 2016లో ఆటోమెటిక్‌గా టోల్ వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు కేంద్ర సర్కారు ఫాస్టాగ్‌ల కంటే వేగంగా టోల్ కలెక్ట్ చేసే కొత్త సిస్టమ్‌ను తీసుకురాబోతోంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూలుకు వాహనదారులు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ తగినంత క్యాష్ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ప్రతిసారి ఇలాంటి తలనొప్పులు లేకుండా ఫాస్టాగ్‌ల నుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్‌కి మారాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల హైవే ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా మారుతుంది.
జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ అనేది ఒక కొత్త టెక్నాలజీ. ప్రస్తుతం దీనిని ముంబైలోని అటల్ సేతు లాంటి కొన్ని రహదారులపై పరీక్షిస్తున్నారు. ఈ సిస్టమ్ కదిలే వాహనాల నంబర్ ప్లేట్లను ప్రత్యేక కెమెరాలతో స్కాన్ చేస్తుంది. ఆ కెమెరాలు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఈ సిస్టమ్‌లో వెహికిల్ రిజిస్ట్రేషన్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్ అమౌంట్ డెబిట్ అవుతుంది.
జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే టోల్ ప్లాజాల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం రాదు. దాంతో ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. రీఛార్జ్, బ్యాలెన్స్ చెకప్ లాంటి అవసరాలు లేకపోవడంతో యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపడుతుంది. ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు రాకపోకలు సాగించవచ్చు.
2024 ఏప్రిల్ ప్రారంభంలో జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్‌ను దేశవ్యాప్తంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌ల విజయం, డేటా ప్రైవసీ లాంటి సమస్యలను పరిష్కరించాక ఈ సిస్టమ్‌ను వెంటనే అమల్లోకి తీసుకురావచ్చు. ఈ జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ భారతదేశంలో హైవే ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చగలదు.