కర్ణాటక అసెంబ్లీ గురువారం కన్నడ భాషా సమగ్రాభివృద్ధి (సవరణ) బిల్లు-2024ను ఆమోదించింది. దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల సైన్బోర్డులను 60శాతం కన్నడ భాషను ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసింది. నిబంధనలు పాటించకపోతే లైసెన్సులు రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం రెండేళ్ల నాటి చట్టాన్ని సవరించింది.
వాణిజ్య, పారిశ్రామిక, వ్యాపార సంస్థలు, ట్రస్టులు, కౌన్సెలింగ్ కేంద్రాలు, ఆసుపత్రులు, ప్రయోగ శాలలు, హోటల్స్ ఇలాంటి అన్నింటికి చెందిన సైన్బోర్డుల్లో తప్పనిసరిగా 60శాతం కన్నడ భాషలోనే రాయాల్సి ఉంటుంది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తోందన్నారు.
కొత్త లైసెన్సులు, ప్రస్తుతం ఉన్న వాటిని పునరుద్ధరించే సమయంలో సైన్బోర్డుల్లో కన్నడ భాష వినియోగానికి సంబంధించిన నిబంధనలు పాటించారా? లేదా ? చూస్తామని.. లేకపోతే జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. పోలీసు సిబ్బందితో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. నేమ్ బోర్డుల్లో కన్నడ వాడని సమస్య బెంగళూరులో మాత్రమే ఉందని, బెంగళూరులోని ఎనిమిది మునిసిపల్ ఏరియాల్లో ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
ఈ కమిటీలు కన్నడను ఉపయోగించకపోవడంపై ఫిర్యాదులను స్వీకరిస్తాయని, ఇందుకోసం ‘కంగవాస్’ పేరుతో యాప్ను తీసుకుస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా గతేడాది కర్నాటకలో భాషా వివాదం చెలరేగింది. దుకాణాదారులు, ఇతర వ్యాపార సంస్థల సైన్ బోర్డుల్లో 60శాతం వరకూ కన్నడ భాషనే వినియోగించాలనే ఉద్యమం కొనసాగింది. దుకాణాల ముందు ఇంగ్లిష్ సైన్ బోర్డుల ఏర్పాటు చేయడంతో కన్నడ భాష అంతరించే ప్రమాదం ఉందంటూ కర్ణాటక రక్షణ వేదిక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.