తెలంగాణ వచ్చినా కూడా నీళ్ల దోపిడీ ఆగలేదని, గత పదేళ్ల పాలనలో నీళ్ల దోపిడీ పెరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సాగునీటి రంగంపై శాసనసభలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా మంత్రి ప్రసంగిస్తూ గత పాలకులు ఇంజినీర్లు, నిపుణుల సూచనలు పట్టించుకోకుండా సొంత ఇంజినీరింగ్ ఆలోచన చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో తెలంగాణకు అన్యాయం చేశారని,కృష్ణా జలాల్లో న్యాయబద్ధంగా రావాల్సిన వాటా సాధనలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
కృష్ణా జలాల్లో మన వాటా కోసం గత ప్రభుత్వం పట్టుపట్టలేదని, బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఓంపీలు వచ్చాయని తెలిపారు. కేసీఆర్ విధానాల వల్లే హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.
కృష్ణా బేసిన్లో న్యాయంగా తెలంగాణకు 68 శాతం వాటా రావాలని, అయితే 550 టీఎంసీల జలాలు తీసుకోవాలనే స్పృహ నాటి పాలకులకు లేదని చెప్పారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగింతకు గత ప్రభుత్వమే సూచనప్రాయంగా అంగీకరించిందని మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పాటు నాటికి 57 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, 2014-23 మధ్య ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.1.81 లక్షల కోట్లు అని, ఒక్కో ఎకరానికి అయిన ఖర్చు రూ.11 లక్షలు అని చెప్పుకొచ్చారు.
గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి ఖర్చు 12 రెట్లు పెరిగిందని చెబుతూ పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి కావడానికి రూ.1.75 లక్షల కోట్లు కావాలని తెలిపారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.38,500 కోట్లతో కాంగ్రెస్ రూపకల్పన చేసిందని, 16.4 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రతిపాదన చేసిందని చెప్పారు. అయితే, గత పాలకులు వేల కోట్ల పనులను పక్కన పెట్టి రూ.38,500 కోట్ల నుంచి రూ.81 వేల కోట్లకు పెంచిందని మంత్రి మండిపడ్డారు.
కృష్ణా జలాల నిర్వాకం, గోదావరిపై బ్యారేజ్‌ల వల్ల రాష్ట్రంలో సాగునీటి రంగం చిన్నాభిన్నమైందని చెబుతూ రూ.1.8 లక్షల కోట్ల ఖర్చుతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై భారం పెరిగిందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరుతో చేసిన అప్పులు, వడ్డీల వల్ల రాష్ట్ర ఖజానా అప్పుల భారంతో కుంగిపోయిందని తెలిపారు. మేడిగడ్డలాగే అన్నారం పిల్లర్లు కుంగుతాయని, ఆ బ్యారేజీలో నీళ్లు ఖాళీ చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
అన్నారం బ్యారేజ్, మల్లన్నసాగర్ కు కూడా ప్రమాదం పొంచి ఉందని, కాళ్లేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్యాలిటీ కంట్రోల్ లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్ మూడేళ్లకు కూలిందని విమర్శలు గుప్పించారు. విజిలెన్స్, ఎన్డిఎస్ఎ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాళేశ్వరంలో అవినీతిని కాగ్ రిపోర్ట్ కూడా బయటపెట్టిందని, 2019లో బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేసినా కూడా కనీస పర్యవేక్షణ లేదని మండిపడ్డారు. బ్యారేజ్ కట్టిన మూడేళ్లకే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం ఏంటని ఉత్తమ్ ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ వ్యయాన్ని ఎందుకు పెంచారో చెప్పడం లేదని నిలదీశారు.