భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో కీర్తికిరీటంలో మరో మైలురాయి చేరింది. వాతావరణ పరిస్ధితులపై పరిశోధనలు చేసేందుకు వీలుగా మూడో తరం ఉపగ్రహం ఇన్సాట్ త్రీడీఎస్ ని ఇవాళ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టారు. జీఎస్ఎల్వీ అంతరిక్ష వాహక నౌక ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది.
భూఉపరితలం అధ్యయనంతో పాటు సముద్రాల ఉపరితలాలను పర్యవేక్షించేందుకు చేసేందుకు వీలుగా ఇస్రో ఈ మూడో తరం వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ త్రీడీఎస్ ను ప్రయోగించింది. 51.7 మీటర్ల పొడవైన జీఎస్ఎల్వీ -ఎఫ్14 శ్రీహరికోటలో ఉన్న స్పేస్పోర్ట్లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.
దీంతో శనివారం మధ్యాహ్నం నుంచి షార్ గ్యాలరీలో ఈ ప్రయోగం కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులంతా కరతాళ ధ్వనులు చేశారు. 2,274 కిలోల బరువున్న ఇన్సాట్ త్రీడీ ఎస్ ఉపగ్రహం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సహా భూ ఉపరితల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వివిధ విభాగాలకు సేవలందిస్తుందని ఇస్రో వెల్లడించింది.
ఇప్పటికే అంతరిక్షంలోకి ప్రయోగించిన ఇన్సాట్ త్రీడీ, ఇన్సాట్ త్రీడీఆర్ లతో కలిసి ఇది సేవలు అందించనుంది. ఈ ఏడాది జనవరి 1న పీఎస్ఎల్వీ సీ58 ఎక్స్పో శాట్ మిషన్ సక్సెస్ అయ్యాక ఇస్రో చేపట్టిన రెండో మిషన్ ఇది. ఇది కూడా విజయవంతమైతే ఇస్రోకు చంద్రయాన్ తో మొదలైన జైత్రయాత్ర కొనసాగుతున్నట్లు భావించవచ్చు.